
సోన్/వరంగల్/సత్తుపల్లి, నవంబర్ 7: రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మండిపడ్డారు. నిర్మ ల్ జిల్లాలోని సోన్ మండల కేంద్రంతోపాటు నిర్మల్ మండలంలోని వెంగ్వాపేట్ గ్రామం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై ఆంక్షలు విధించి రైతులను ఆగం చేస్తున్నదని విమర్శించారు. యాసంగి సీజన్ నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ద్వారా చేపట్టే అవకాశం లేనందున, రైతులు ఆదాయం వచ్చే పంటలు వేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలన్నారు.
కేంద్రం కొర్రీలు: మంత్రి ఎర్రబెల్లి
హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధాన్యం సేకరణపై వరంగల్, హనుమకొండ జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రైతు పండించిన ప్రతి గింజనూ కోనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని కొనియాడారు. ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం నిబంధనల పేరిట కొర్రీలు పెడుతున్నదని మండిపడ్డారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నదని తెలిపారు.
లాభదాయక పంటలు సాగుచేయాలి..
యాసంగిలో సర్కారు సూచించిన విధంగా రైతులు లాభదాయక పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్‌రావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో కలిసి ఎమ్మెల్యే సండ్ర కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నదని తెలిపారు.