హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): పంజాబ్‌లో పూర్తిగా ధాన్యం కొంటున్న కేంద్రం, అవసరమైతే ప్రత్యామ్నాయాలు చూపుతూ అండగా నిలుస్తున్నది. తెలంగాణలో మాత్రం సీఎంఆర్‌లో రా రైస్ ఇస్తేనే తీసుకుంటామని భీష్మిస్తున్నది. పంజాబ్‌కు చేతనయినంత సాయం చేసేందుకు ఉబలాటపడుతుంటే, తెలంగాణపై కక్ష సాధింపునకు ఆరాటపడుతున్నది. ఇటీవల కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ, ఎఫ్‌సీఐ తీసుకున్న పలు నిర్ణయాలే ఇందుకు నిదర్శనం. ఇటీవల పంజాబ్‌లో కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ కార్యదర్శి సుధాన్షు పాండే పర్యటించారు. ధాన్యం ఎక్కువగా ఉత్పత్తి అవడం, నిల్వ, రవాణా సమస్యల నేపథ్యంలో అధిక నిల్వలు కలిగిన ఫిరోజ్‌పూర్, గుర్దాస్పూర్, హోషియార్‌పూర్‌తో పాటు మరికొన్ని జిల్లాల్లో నేరుగా ధాన్యం వేలం వేయాలని స్వయంగా ఆ రాష్ర్టానికి సలహా ఇచ్చారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన తర్వాతే వేలం వేయాలని సూచించారు. వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేయకుంటే, సీఎంఆర్ రూపంలో తీసుకొంటామని భరోసా ఇచ్చారు.
పంజాబ్ కోసం కొత్త విధానం
వాస్తవానికి ఎఫ్‌సీఐ సీఎంఆర్(బియ్యం)ను మాత్రమే తీసుకుంటుంది. నేరుగా ధాన్యం తీసుకోవడం, విక్రయించడం చేయదు. ఇప్పటివరకు దేశంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ నేరుగా ఎప్పుడూ వేలం వేయలేదు. ఎఫ్‌సీఐ తరఫున రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరిస్తుంది. అది మిల్లర్లకు ఇచ్చి.. మిల్లింగ్ చేసిన తర్వాత ఎఫ్‌సీఐకి బియ్యం రూపంలో చేరవేస్తుంది. ఆ తర్వాతే ఎఫ్‌సీఐ నుంచి రాష్ర్టానికి డబ్బులు వస్తాయి. ఇదీ సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఇప్పుడు పంజాబ్ కోసం కేంద్రం నూతనంగా నేరుగా ధాన్యం వేలం వేసే విధానాన్ని తెరపైకి తీసుకొనిరావడం గమనార్హం. ఈ వేలం ప్రక్రియపై అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్టు తెలిసింది. త్వరలోనే ధాన్యం వేలం వేయనున్నట్టు సమాచారం.
మరి తెలంగాణలో ఎందుకు వేలం వేయరు?
అధిక ధాన్యం పేరుతో పంజాబ్‌లో నేరుగా ధాన్యం వేలం వేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, అదే తెలంగాణలో మాత్రం కచ్చితంగా సీఎంఆర్‌లో రా రైస్ మాత్రమే ఇవ్వాలని పట్టుపడుతున్నది. పంజాబ్ తరహాలోనే తెలంగాణలోనూ అధిక ధాన్యం ఉత్పత్తి అవుతున్నది. నిల్వ, రవాణా సమస్యలున్నాయి. యాసంగిలో బాయిల్డ్ రైస్ సమస్య తలెత్తుతున్నది. ఈ నేపథ్యంలో బాయిల్డ్ రైస్ సమస్య పరిష్కారానికి నేరుగా ధాన్యాన్ని ఎందుకు వేలం వేయడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. వేలంలో వ్యాపారులే కొనుగోలు చేసి ఎగుమతి చేసుకుంటారు. అప్పుడు బాయిల్డ్ రైస్, రా రైస్ సమస్యే ఉత్పన్నం కాదు. తమ నుంచి సీఎమ్మార్(బియ్యం) సేకరణ కాకుండా నేరుగా ధాన్యమే కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. కానీ ఈ ప్రతిపాదనను కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ తిరస్కరించారు. నేరుగా ధాన్యం కొనుగోలు చేయబోమని, బియ్యం(రా రైస్) మాత్రమే తీసుకుంటామని స్పష్టంచేశారు. కానీ వారి మాటలకు విరుద్ధంగా పంజాబ్‌లో నేరుగా ధాన్యం వేలం వేస్తుండటం గమనార్హం. పంజాబ్‌పై పక్షపాతం, తెలంగాణపై వివక్ష ప్రదర్శించటం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంజాబ్‌లో మాదిరే తెలంగాణలో ధాన్యాన్ని వేలం వేస్తే సమస్య ఉండదని పౌరసరఫరాలశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అక్కడ రూ. 481 ఆదా.. ఇక్కడ రూ. 14 వేల కోట్ల నష్టం
పంజాబ్‌లో నేరుగా ధాన్యాన్ని వేలం వేయడం ద్వారా ప్రతి క్వింటాల్‌కు రూ.481 ఆదా అవుతుందని ఎఫ్‌సీఐ అంచనా వేసింది. తెలంగాణలో ధాన్యం సేకరించకుంటే ఈ సీజన్లో రైతులు ఏకంగా రూ.14 వేల కోట్లు నష్టపోయే ప్రమాదం ఉంది. పంజాబ్‌కు ఆదా చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం, తెలంగాణను నట్టేట ముంచే కుట్ర చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంజాబ్‌లో సీఎమ్మార్ కిలో బియ్యానికి రూ.42 చెల్లిస్తూ, తెలంగాణకు మాత్రం రూ.32 చెల్లిస్తున్నది.

మాకు పంజాబ్‌పై ప్రేమ లేదు. తెలంగాణపై వివక్ష లేదు. అన్ని రాష్ర్టాలు సమానమే. ధాన్యం కొనుగోళ్లలో దేశమంతా ఒకే విధానాన్ని అమలుచేస్తున్నాం. పంజాబ్‌లో తరహాలోనే తెలంగాణలోనూ కొనుగోలు చేస్తున్నాం.
– ఇదీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ ,నాయకులు వల్లె వేస్తున్న నీతిసూత్రం.
పంజాబ్‌లో కొన్ని చోట్ల ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉన్నందున నేరుగా వేలం వేయాలని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది. ఇటీవల ఆ రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ కార్యదర్శి సుధాన్షు పాండే స్వయంగా వేలంపై సూచనలు చేశారు. వేలంలో కొనుగోలు కాకుంటే సీఎంఆర్ తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
– పంజాబ్‌కు కేంద్రం ప్రత్యామ్నాయం ,చూపుతున్న తీరుకిది నిదర్శనం.