లోక్ అదాలత్‌లో ఇరు వర్గాల కక్షిదారులు ఒప్పందం చేసుకుని కేసులను రాజీ చేసుకోవడం శుభపరిణామమని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అన్నారు. శనివారం ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన 17 బెంచ్‌ల పరిధిలో 9661 కేసులు పరిష్కారమయ్యాయని, రూ.8.58కోట్ల నష్టపరిహారం అందించేందుకు అంగీకారం కుదిరినట్లు ఆయన తెలిపారు. చట్టాలు, న్యాయంపై ప్రజల్లో అవగాహన పెరగడంతో లోక్‌అదాలత్‌లకు మంచి స్పందన వస్తున్నదన్నారు.
సంగారెడ్డి, డిసెంబరు 11 : ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుందని, చట్టాలు, న్యాయంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో లోక్‌అదాలత్‌లలో 9661 కేసులు రాజీ అయ్యాయని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. న్యాయవాదులు, ఇరువర్గాలకు చెందిన బాధితులు కార్యక్రమంలో పాల్గొని కేసులను రాజీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 17 బెంచ్‌లలో అధిక సంఖ్యలో కేసులు రాజీ చేసుకోవడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా 7100 క్రిమినల్ కేసులను న్యాయవాదుల సలహాలు, సూచనలతో కక్షిదారులు ఒప్పందం కుదుర్చుకుని రాజీయే రాజమార్గమని తెలుసుకుని రాజీ పడ్డారన్నారు. వివిధ కేసుల్లో బాధితులకు రూ. 8కోట్ల 58లక్షల 6వేల 843లు నష్టపరిహారం అందించేందుకు ఆయా యాజమాన్యాలు అంగీకరించాయన్నారు. ముఖ్యంగా భూ తగాదాలు, భార్య భర్తలకు సంబంధించినవి, క్రిమినల్, చెక్‌బౌన్స్, చిట్‌ఫండ్, వాహనాల ప్రమాద కేసులపై ఇరువర్గాల కక్షిదారులు ఒప్పందం చేసుకుని రాజీ పడడం శుభపరిణామమన్నారు. అలాగే, డబ్బు.. సమయం వృథా కాకుండా సమన్వయంతో కేసులను పరిష్కరించుకోవడం హర్షణీయమన్నారు. లోక్‌అదాలత్‌లలో రాజీ చేసుకున్న కేసుల్లో బాధితులు పైకోర్టుకు వెళ్లడానికి అవకాశం లేదని ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి కక్షిదారులకు సూచించారు.
పరిష్కరించిన కేసులు…
లోక్ఆదాలత్లలో పరిష్కరించిన కేసులు సివిల్-23, విద్యుత్-2303, క్రిమినల్-7100, వాహన ప్రమాదాలు -36లకు సంబంధించిన రూ. 2,22,12,000కోట్ల పరిహారం బాధితులకు అందించేందకు రాజీ చేసుకున్నారన్నారు. అలాగే, బ్యాంకు రికవరీ కేసులు-195 కాగా, రూ.70,55,143 లక్షలను రికవరీ చేసుకునేందుకు ఒప్పం దం చేసుకున్నారని న్యాయమూర్తి వెల్లడించారు. భూ సేకరణ నష్ట పరిహారం కేసులు-4 వివిధ గ్రామాలకు చెందిన 130 మంది బాధితులకు రూ. 6,35,94,843 కోట్లు పరిహారంగా చెల్లించేందుకు రాజీ చేసుకున్నట్లు తెలిపారు. ఈ లోక్‌అదాలత్‌లలో న్యాయమూర్తులు కర్ణ కుమార్, అనిత, ఆశాలత, మహమ్మద్ జలీల్, హనుమంతరావులతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, బెంచ్ సభ్యులు బాల్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, విజయ్ శంకర్‌రెడ్డి, గౌతమి, సంధ్య, సాయి కుమార్, ప్రభాకర్, మహమ్మద్ ఖలీద్, మలేశం తదితరులు పాల్గొన్నారు.
ప్రమాద కేసులో బాధితులకు న్యాయం…
జహీరాబాద్‌కు చెందిన శ్యామమ్మ పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మృతుడు పాలసీ తీసుకొన్నాడు. అయితే, ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ మేరకు బాధితులకు రూ. 20లక్షలు సకాలంలో చెల్లించకపోవడంతో లోక్‌అదాలత్‌లో కేసు దాఖలు చేశారు. శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో బాధితుల తరుపున న్యాయవాది మల్లే శం, ఇన్సూరెన్స్ కంపెనీ తరుపున న్యాయవాది గౌతమిలు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ఉమ్మడి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ న్యాయమూర్తి మోటారు వాహనాల చట్టం ప్రకారం బాధితులకు రూ.15లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. మృతుడి తల్లి శ్యామమ్మకు రూ.10లక్షలు, మృతుడి తమ్ముడు అంబదాసుకు రూ.5 లక్షల పరిహారం అందజేశారని న్యాయవాది మల్లే శం వెల్లడించారు.