న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి ఎయిరిండియా మూడో విమానంలో 240 మంది, రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుంచి టాటా గ్రూప్ విమానంలో 198 మంది ఆదివారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకు 907 మంది స్వదేశానికి చేరుకున్నారు. శనివారం బుచారెస్ట్ నుంచి మొదటి విమానంలో 219 మంది ముంబై ఎయిర్పోర్టుకు, ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు 250 మందితో కూడిన రెండో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండయింది. మరో రెండు విమానాలు పంపుతున్నట్టు ఎయిరిండియా వెల్లడించింది. ఉక్రెయిన్లో 13వేల మంది భారతీయులు ఉన్నారని కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియా పేర్కొన్నారు.
యుద్ధభూమి నుంచి విద్యార్థులు స్వదేశానికి రావడంతో విమానాశ్రయాల్లో భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లల రాకకోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు.. సురక్షితంగా వారి రాక అవధుల్లేని ఆనందాన్నిచ్చింది. కన్నబిడ్డలను గుండెలకు హత్తుకున్నారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న వారికి అక్కడి భారత ఎంబసీ తాజా సూచనలు చేసింది. కాగా, భారతీయ విద్యార్థులు దేశం విడిచివెళ్లకుండా ఉక్రెయిన్ సైనికులు అడ్డుకొంటున్నారని, ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దు షెహ్ని ప్రాంతం వద్ద తమను కొట్టారని కేరళకు చెందిన ఓ విద్యార్థిని వీడియో సందేశంలో పేర్కొంది.