కాచిగూడ, నవంబర్ 16: సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పెన్షన్‌దారులందరికీ రూ.9వేల పింఛను వర్తింపజేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం బీహెచ్ఇఎల్, ఐడీపీఎల్, ఈసీఐఎల్, హెచ్ఎంటీ, ప్రాగాటూల్స్, హెచ్‌సీఎల్, మిథానీ, బీడీఎల్, ఆర్టీసీ పెన్షన్‌దారులు బర్కత్‌పుర ఈపీఎఫ్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఎగ్జెంప్టెడ్, అన్ఎగ్జెంప్టెడ్ అనే భేదం లేకుండా పెన్షన్‌దారులందరికీ రూ.9వేలు పింఛను చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షన్‌దారుల గృహనిర్మాణానికి బ్యాంకులకు బదులుగా ఈపీఎఫ్ నిధుల నుంచి చెల్లించాలని కోరారు. పెన్షనబుల్ జీతాన్ని 30 నెలల ప్రాతిపదికన నిర్ణయించాలని అన్నారు. పెన్షన్‌దారులు పెన్షన్‌ను అమ్ముకొనే పద్ధతిని పునరుద్ధరించాలని పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన ఎంప్లాయి, ఎంప్లాయర్ల డిక్లరేషన్ ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు. ఈపీఎఫ్ కమిషనర్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పెన్షనర్లు, రిటైర్డ్ అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు.