హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న పోడు భూముల సమస్యకు శాశ్వత పరిషారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసలైన, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈ కమిటీల ఏర్పాటు, అర్హుల గుర్తింపునకు జిల్లా స్థాయిల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిర్మల్, ఆదిలాబాద్, మహబూబాబాద్‌లో జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్ హాజరయ్యారు. ఆదివారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో అఖిలపక్ష సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హాజరుకాగా.. పోడు భూముల సమస్యకు సంబంధించి అటవీ హక్కుల కమిటీల నియామకం, పోడు సమస్యలపై చర్చించారు. జిల్లా స్థాయిలో అఖిలపక్ష సమావేశాలు ముగిశాక, నవంబర్ 8 నుంచి పోడు రైతుల నుంచి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించనున్నారు. రాష్ట్రంలో సుమారు 8 లక్షల ఎకరాల్లో పోడు చేస్తున్నట్టు అంచనా.