
వెంకటాపూర్, నవంబర్ 29 : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటకు చెందిన తడండ్ల శ్రావణ్ అంతర్జాతీయ ఫొటోగ్రఫీలో ప్రతిభ కనబరిచాడు. ఆన్లైన్ కాంపిటీషన్లో ఏకంగా ఎనిమిది అవార్డులు సొంతం చేసుకున్నాడు. గోల్డెన్ లయన్ ఫొటో సర్క్యూట్-2021 మలేషియా తరపున ఆసియా ఫొటోగ్రాఫర్స్ యూనియన్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్‌లో పోటీలు నిర్వహించారు. ట్రావెలింగ్ విభాగంలో రెండు, ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికా(పీఎస్ఏ) నుంచి పల్లెటూరి ప్రజల జీవనశైలి, సంస్కృతి సంప్రదాయాలు అంశాలలో రెండు గోల్డ్ మెడల్స్, ఐసీపీఈలో గోల్డ్ మెడల్‌తోపాటు మరో మూడు అవార్డులకు శ్రావణ్ ఎంపికైనట్టు సోమవారం ప్రకటించారు. పల్లెటూరి ప్రజల జీవనశైలికి అద్దం పట్టేలా.. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబించేలా, తెలంగాణ పండుగలకు సంబంధించిన చిత్రాలు శ్రావణ్‌కు అవార్డులు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే 11 దేశాల నుంచి శ్రావణ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఉమ్మడి జిల్లా ఫొటోగ్రాఫర్లు, పలువురు నాయకులు శ్రావణ్ అభినందించారు.