భువనేశ్వర్: అరవై ఏండ్ల నిత్య పెండ్లి కొడుకు బండారం బయటపడింది. గత 48 ఏండ్లలో 7 రాష్ర్టాల్లో 14 మందిని వివాహం చేసుకున్న ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లా పట్కురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన నిందితుడు రమేశ్ చంద్ర 1982లో మొదటి పెండ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 2002లో మరో మహిళను మనువాడాడు. వీరిద్దరి ద్వారా అతడికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. 2002 నుంచి ఇప్పటివరకు పెండ్లి సంబంధాల వెబ్సైట్ల ద్వారా ఏకంగా 12 మందిని పెండ్లి చేసుకుని, వారి దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేసి వదిలేసేవాడు. ప్రస్తుతం భువనేశ్వర్లో తన చివరి భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఆమె ఎట్టకేలకు ఈ ప్రబుద్ధుడి బండారం బయటపెట్టింది.