హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం విద్యాశాఖ నిర్వహించిన టెట్‌లో టీచర్లు భారీగా ఫెయిలయ్యారు. ఏండ్లుగా స ర్కార్ బడుల్లో ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్న కొందరు టీచర్లు టెట్ ను గట్టెక్కలేకపోయారు. ఏకంగా 6,728 మంది ఫెయిలయ్యారు. పేపర్-1లో 1,544, పేపర్-2 (గణితం, సైన్స్)లో 2,411, పేపర్-2 (సోషల్)లో 2,773 మంది ఫెయిలవడం గమనార్హం.
సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఈ ఫలితాలను విడుదలచేశారు. ఈ నెల 8, 9వ తేదీల్లో ఇన్ సర్వీస్ టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 24,986 మంది దరఖాస్తు చేయ గా, 22,477 మంది పరీక్షలు రాశారు. వీరిలో 15,749 (70.07శాతం) మంది మాత్రమే క్వాలిఫై కావడం గమనార్హం. ఫలితాల విడుదలలో టెట్ కన్వీనర్ జీ రమేశ్, డిప్యూటీ డైరెక్టర్ రేవతి పాల్గొన్నారు.
ఇన్ సర్వీస్ టీచర్ల కోసం మరో టెట్ పరీక్షను నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ టెట్ ఇన్‌సర్వీస్ టీచర్స్-2 పేరిట ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు. పరీక్షలను నవంబర్ 16 నుంచి 21 వరకు ఆన్లైన్లో నిర్వహిస్తామని చెప్పారు.
