గురుగ్రామ్, ఆగస్టు 1: రెండు వర్గాల మధ్య ఘర్షణలతో హర్యానా అట్టుడుకుతున్నది. వీహెచ్‌పీ మత ఊరేగింపు సందర్భంగా సోమవారం నుహ్ జిల్లాలో రేగిన హింసాత్మక ఘటనలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పాకుతున్నాయి. మంగళవారం సాయంత్రం నుహ్ పొరుగున ఉండే గుర్‌గ్రామ్ జిల్లాలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. గుర్‌గ్రామ్‌లోని బాద్షాపూర్లో ఓ రెస్టారెంట్‌తో పాటు 14 దుకాణాలను ధ్వంసం చేశారు. సెక్టార్ 66 పరిధిలో ఏడు దుకాణాలకు నిప్పుపెట్టారు. బైక్‌లు, కార్లలో వచ్చిన దాదాపు 200 మందితో కూడిన గుంపు ప్రధానంగా బిర్యానీ అమ్మే దుకాణాలు, ఇతర ఫుడ్‌స్టాళ్లపై దాడులు చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో బాద్షాపూర్లో దుకాణాలను మూసివేశారు. నుహ్‌లో మంగళవారం కర్ఫ్యూ విధించారు. పొరుగు జిల్లాల్లో భద్రతా దళాలు ఫ్లాగ్‌మార్చ్‌లు నిర్వహించాయి. అలాగే పలు ప్రాంతాల్లో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించాయి. రాష్ట్రంలో అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉన్నదని సీఎం ఖట్టర్ అన్నారు. కాగా, హర్యానా మత హింసకు వ్యతిరేకంగా బుధవారం నోయిడా స్టేడియం నుంచి రజినీగంధ చౌక్ వద్ద భారీ ర్యాలీ చేపడుతామని వీహెచ్‌పీ పబ్లిసిటీ చీఫ్ రాహుల్ దూబే పేర్కొన్నారు. కాగా, నోయిడాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నది.
ఐదుకు చేరిన మృతుల సంఖ్య
సోమవారం అర్ధరాత్రి అల్లరి మూక గురుగ్రామ్ సెక్టార్ 57లోని ఓ మసీదుకు నిప్పంటించింది. అక్కడున్న వారిపై కాల్పులు జరిపింది. మసీదు ఇమామ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో హర్యానా అల్లర్లలో మృతుల సంఖ్య అయిదుకు చేరింది. జునాయిద్, నాసిర్ అనే ఇద్దరి హత్య కేసులో వాంటెడ్‌గా ఉన్న భజరంగ్‌దళ్ కార్యకర్త మోనే మనేసర్ ర్యాలీలో పాల్గొంటునారన్న పుకార్ల నేపథ్యంలో సోమవారం నుహ్‌లో హింస చెలరేగింది. ఇప్పటికి వరకు అల్లర్లకు సంబంధించి 44 కేసులు నమోదు చేశామని, 70 మందిని పైగా అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రానికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయని గుర్‌గ్రామ్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ యాదవ్ పేర్కొన్నారు. అల్లర్ల నేపథ్యంలో మంగళవారం గుర్‌గ్రామ్‌లో అన్ని విద్యాసంస్థలను మూసివేశారు.