గజ్వేల్, ఆగస్టు 11: రాష్ట్రంలోని 46 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గీత కార్మికులను ముక్కు పిండి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. గీతన్నల చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం సిద్దిపేట జిల్లాలోని ఆర్అండ్ఆర్ కాలనీ, గజ్వేల్‌కు విచ్చేసిన యాత్రకు గీత కార్మికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. 12 రోజులుగా చేపడుతున్న యాత్రకు ప్రతి మండల కేంద్రం లో విశేష స్పందన లభిస్తున్నదని తెలిపారు. కల్లు, గీత కార్మికులపై అధికారులు, అధికార పార్టీ నాయకుల వేధింపులు ఆపేసి, మామూళ్లను బంద్ చేయాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 400 మంది కార్మికులు మృతి చెందగా, ప్రభుత్వం ఇస్తామన్న రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో ఇవ్వకపోవడంతో సదరు కుటుంబాలు రోడ్డు న పడ్డాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎంతో మందిపై అక్రమ కేసులు నమోదు చేయించి జైలుకు పంపారని, తాము అధికారంలోకి రాగానే అధికారులు, కాంగ్రెస్ నాయకుల అంతు చూస్తామని హెచ్చరించారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి ఇప్పటికైనా కండ్లు తెరిచి దుకాణాలను తెరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం వెంకటరమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.