(ఎడ్యుకేషన్ డెస్క్), ఫిబ్రవరి 19: తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టెస్కాబ్) పరిధిలోని వివిధ జిల్లాల్లో ఉన్న కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీబీ)లలో స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 445 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ మేనేజర్-73, స్టాఫ్ అసిస్టెంట్-372 ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా ఆదిలాబాద్-69, హైదరాబాద్-52, కరీంనగర్-84, మహబూబ్నగర్-32, మెదక్-72, నల్లగొండ-36, వరంగల్-50, ఖమ్మం-50 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో కామర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. పై రెండు పోస్టులకు కూడా తెలుగు భాషలో ప్రావీణ్యంతో పాటు ఇంగ్లిష్ నాలెడ్జ్ ఉండాలి. వయస్సు 18-30 ఏండ్ల మధ్య ఉండాలి. రెండు దశల్లో నిర్వహించే ఆన్లైన్ (ప్రిలిమ్స్, మెయిన్) పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ మార్చి 6. పూర్తి వివరాల కోసం https://tscab.org/notifications వెబ్సైట్ చూడవచ్చు.