Telangana | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నది. దీంతో రాష్ట్ర ఖజానాకు రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నది. ఎక్సైజ్‌శాఖ చరిత్రలోనే రికార్డు స్థాయిలో మద్యం విక్రయించినట్టు తెలుస్తున్నది. ఒక్కరోజులో సుమారు రూ.403 కోట్ల మద్యం విక్రయించి.. ఎక్సైజ్‌శాఖ రికార్డు నెలకొల్పింది. గడిచిన ఐదు రోజుల్లో మద్యం షాపుల నుంచి బెల్ట్‌షాపుల వరకూ కోట్ల విలువైన మద్యాన్ని చేరవేశారు. డిసెంబర్ 28 నుంచి జనవరి ఒకటి వరకు కేవలం 5 రోజుల్లోనే రూ.1,800 కోట్ల వరకు ఆర్జించాలన్న లక్ష్యానికి చేరువలో ఎక్సైజ్‌శాఖ ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంతో పోల్చితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భాన్ని ఉపయోగించుకొని భారీగా మద్యం విక్రయాలు జరుపాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆబ్కారీ అధికారులు వ్యూహాన్ని రూపొందించారు. అందులో భాగంగా ఆయా మద్యంషాపులకు ఇప్పటికే భారీగా మద్యం చేరగా, అక్కడి నుంచి బెల్ట్‌షాపులకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఎక్సైజ్‌శాఖ నుంచి బెల్ట్‌షాపులకు ఎలాంటి షరతులు విధించకపోవడంతో.. 31, జనవరి 1వ తేదీల్లో వాటి నిర్వాహకులు లక్షల రూపాయలు అమ్మకాలు జరిపారు. సంవత్సరం చివరి రెండు రోజుల్లో తెలంగాణ గ్రామాలు, పట్టణాల్లోని దాదాపు ప్రతి గల్లీలో మద్యాన్ని సమృద్ధిగా అందుబాటులో ఉంచారు. ఇక మిగిలిన జనవరి 1వ తేదీన కూడా భారీగా మద్యం విక్రయించేందుకు పథకం ప్రకారం ఏర్పాట్లు చేశారు.
30న రూ.402.62 కోట్ల మద్యం విక్రయం
ఏడాదికి 7-8 సార్లు మద్యం డిపోల నుంచి సరుకును లిప్ట్ చేసే వెలుసుబాటు కల్పించారు. ఆ పరిమితి దాటిన వారికి ప్రభుత్వం కల్పించిన ‘ప్రత్యేక అనుమతి’తో రసీదులు ఇచ్చి మరీ మద్యాన్ని లోడ్ చేసినట్టు తెలిసింది. దీంతో 30వ తేదీన ఒక్కరోజే మద్యంపై వచ్చిన ఆదాయం అక్షరాల రూ.402.62 కోట్లు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా 3,82,265 లికర్ కేసులు, 3,96, 114 బీర్ కేసులు అమ్మడైనట్టు తెలిసింది. చలికాలంలో కూడా లిక్కర్ కంటే బీర్లే అత్యధికంగా అమ్ముడుపోవడటం విశేషం. 31 రాత్రికి మద్యం కొనుగోళ్లు మరింత భారీగా పెరిగినట్టు సమాచారం. తెలంగాణలో మద్యం కొనుగోళ్లు ఊపందుకోగా, వ్యాపారస్తులలో కూడా జోష్ పెరిగింది.
30 నాటికే 3,523.16 కోట్ల ఆదాయం
ఏటా డిసెంబర్ వచ్చిందంటే చాలు.. ఆ జోష్ వేరే కనిపిస్తుంది. డిసెంబర్ 26 నుంచి జనవరి 1 వరకు ‘న్యూ ఇయర్ వీక్’లో గ్లాసులు గలగలలాడాల్సిందే. అందుకే ఎక్సైజ్‌శాఖకు డిసెంబర్ ఎంతో కీలకం. అయితే, ఈ డిసెంబర్ 30 నాటికే ఆబ్కారీ శాఖకు రూ.3,523.16 కోట్ల ఆదాయం సమకూరింది. 2023 డిసెంబర్లో 31 వరకూ ఎక్సైజ్‌శాఖకు మద్యం అమ్మకాలు, వ్యాట్‌తో కలిపి వచ్చిన ఆదాయం రూ.3,333 కోట్లు కాగా.. ఈ సారి 30వ తేదీ నాటికే రూ.3,523.16 కోట్లు సమకూరాయి. ఇక 31వ తేదీన వచ్చిన లాభాలు అదనం. ముందస్తు ప్రణాళిక ప్రకారం మద్యం షాపులకు, వాటి నుంచి బెల్ట్‌షాపులకు మద్యం చేరవేయడంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులు సఫలీకృతయ్యారని అంటున్నారు. నాడు తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని, బెల్ట్‌షాపులు ఎత్తివేయిస్తామ ని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ఖజానా నింపేందుకు దానిపైనే ఆధారపడటంపై అంతా ముక్కు న వేలేసుకుంటున్నారు.