చెన్నై, జూలై 1: తమ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడేందుకు బేరసారాలు సాగిస్తున్నారంటూ అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే బుధవారం పరస్పరం ఆరోపణాస్ర్తాలు సంధించుకున్నాయి. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీమంత్రి వీ సెంథిల్ బాలాజీ ప్రయత్నించారంటూ టీవీకే ఆరోపించగా, ఇద్దరు డీఎంకే ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ఎండీఎంకే అధినేత వైకో కుట్ర పన్నారని డీఎంకే ఆరోపించింది.
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌కు వ్యతిరేకంగా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడు దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ తిరునావుక్కరసు అనే వ్యక్తి తనను సంప్రదించినట్లు ఉతన్గరైకు చెందిన టీవీకే ఎమ్మెల్యే ఏఎన్ ఇళయరాజా చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తిరునావుక్కరసు అనే వ్యక్తి కూడా ఉన్నారు. టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని వీరిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
ఇందుకు ప్రతిఫలంగా తనకు రూ. 35 కోట్లు ఇస్తామంటూ తిరునావుక్కరసు ప్రలోభపెట్టినట్లు ఇళయరాజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా ఉండగా తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వారి చేత రాజీనామా చేయించడానికి ముఖ్యమంత్రి విజయ్ ప్రయత్నించారని ఆరోపిస్తూ డీఎంకే నిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతి రాష్ట్ర గవర్నర్ ఆర్వీ అర్లేకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేస్తే జరిగే ఉప ఎన్నికల్లో వారి తరఫున ప్రచారం చేసి గెలిపించుకుంటానని విజయ్ మాటిచ్చారంటూ ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో చేసిన ప్రకటనను భారతి ఉటంకించారు.