వికారాబాద్, నవంబర్ 26 : ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, ఎస్పీ నారాయణరెడ్డిలతో కలిసి 2కే రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్పెషల్ సమ్మరి రీవిజన్ 2025లో భాగంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఓటు హక్కు ఆయుధం వంటిదని, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.
ఇందుకు గాను ప్రత్యేక వెబ్సైట్ ద్వారా తహసీల్దార్, బీఎల్వోల దగ్గర, ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఓటు అమూల్యమైనదని, 18 ఏండ్లు నిండిన యువతీయువకులు ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి ఏంఎ సత్తార్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.