హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలకు బీసీ కుల సర్టిఫికెట్లను జారీ చేయవద్దని కలెక్టర్లకు బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి శ్రీధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరామన్ కమిషన్ రిపోర్టు ఆధారంగా తెలంగాణ భౌగోళిక ప్రాంతంలోలేని, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించి 130 కులాలతో రాష్ట్ర బీసీ జాబితాను రూపొందించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 26 కులాల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : సాంకేతికతతో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో నిర్వహించిన ట్రస్ట్ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. భారత్‌తో అమెరికా కుదుర్చుకున్న ట్రస్ట్(ట్రాన్స్ఫార్మింగ్ ది రిలేషన్షిప్ యుటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ) కార్యక్రమంతో అమెరికా జాతీయ భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంపొందించుకున్నట్టు తెలిపారు. భారత్‌తో కలిసి పనిచేయడం ద్వారా అమెరికా ఆవిష్కరణలకు సురక్షిత ఎకో సిస్టమ్‌ను తయారు చేసుకోగలుగుతున్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : మహిళల హక్కుల సాధనే లక్ష్యంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) పని చేస్తున్నదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి స్పష్టంచేశారు. ఈ నెల 25 నుంచి 28 వరకు నాలుగురోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన ఐద్వా 14వ మహాసభలు దిగ్విజయంగా ముగిసినట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షురాలు పుణ్యవతి, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి, సీనియర్ నాయకురాలు జ్యోతి, రాష్ట్ర కార్యదర్శులు ఆశాలత, సరళతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై రాబోయేరోజుల్లో సమరశీల పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.