హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రవేశపెట్టిన 17 ఫంక్షనల్ వర్టికల్స్ (పోలీస్ పని విభజనాంశాలు)లో ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీస్ స్టేషన్ల జాబితా విడుదలైంది. ప్రతి జిల్లా లేదా పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని వర్టికల్స్‌లో ఉత్తమ పనితీరు కనబర్చిన టాప్-3 పోలీస్ స్టేషన్లు, ఒక్కో వర్టికల్వారీగా మెరుగైన పనితీరు కనబర్చిన 3 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు. ఈ విధంగా గతేడాదికి మొత్తం 240 పోలీస్ స్టేషన్లు ఎంపికైనట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. వాటి వివరాలను శుక్రవారం యూనిట్లవారీగా విడుదల చేశారు. అన్ని వర్టికల్స్‌లో ఉత్తమ పనితీరు కనబర్చిన మూడు పోలీస్ స్టేషన్ల సిబ్బందిని ఆయా యూనిట్ల అధికారులు సన్మానించాలని ఎస్పీలు, పోలీస్ కమిషనర్లందరికీ డీజీపీ ఆదేశాలు జారీచేశారు. ఉత్తమ పోలీస్ స్టేషన్ల ఎంపికలో విధులన్నింటినీ బేరేజు వేసేందుకు 58 రకాల కీ ఫ్యాక్టర్ ఇండికేషన్స్ (కేపీఐ)ను పెట్టుకొని ఉత్తమ ప్రతిభకు 90% వెయిటేజీ ఇచ్చినట్టు చెప్పారు.
అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో ‘5ఎస్’ విధానం అమలు, రికార్డుల నిర్వహణ, స్టేషన్ల ఆవరణలో పచ్చదనం, ప్రజలకు, సిబ్బందికి కల్పించిన టాయిలెట్ సదుపాయాలు, పార్కింగ్ ఏరియా తదితర అంశాలకు 10% మార్కులను కేటాయించినట్టు తెలిపారు. పోలీస్ స్టేషన్లను క్యాటగిరీ-1 (ఏడాదిలో 450 కేసులు మాత్రమే నమోదయ్యేవి), క్యాటగిరీ-2 (451-900 కేసులు నమోదయ్యేవి), క్యాటగిరీ-3 (900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యేవి)గా విభజించి పోల్చి చూసినట్టు వివరించారు.