Canada | న్యూఢిల్లీ : కెనడాలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెను సవాలుగా మారాయి. తల్లిదండ్రుల్లో 24 శాతం మంది తమ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టడం కోసం తాము తినడం తగ్గించుకుంటున్నారు. సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి పొదుపు చేయడం కోసం కిరాణా సరుకుల ఖర్చును తగ్గించుకుంటున్నామని సర్వేలో పాల్గొన్నవారిలో 90 శాతం మంది చెప్పారు. ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడం కోసం తల్లిదండ్రులు తమ ఆహారాన్ని, నిత్యావసరాలను త్యాగం చేస్తున్నారు.
ఫుడ్ బ్యాంకుల్లోనూ కొరత
కెనడాలో ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేసే ఫుడ్ బ్యాంకుల్లో కూడా ఆహార కొరత ఉంది. దీంతో కొన్ని ఫుడ్ బ్యాంకులు అంతర్జాతీయ విద్యార్థులకు ఆహారాన్ని ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాయి. భారతీయ విద్యార్థులు కూడా ఈ బాధితుల్లో ఉన్నారు. కిరాణా సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో జీవన వ్యయం భారీగా పెరిగింది. తమ పిల్లలకు తగినంత ఆహారం అందించడం కోసం తాము తిండి తగ్గించుకున్నామని 24 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. పోషక విలువలు తక్కువగా ఉండే ఆహారం కాస్త చౌకగా లభిస్తుండటంతో దానినే కొంటున్నట్లు తెలిపారు. ఒక పూట తింటే, మరో పూట తినడం మానేస్తున్నట్లు 84 శాతం మంది చెప్పారు. కెనడాలో ఆర్థిక సంక్షోభానికి సంకేతం ఇదొక్కటే కాదు. ఈ సంక్షోభ సమయంలో కెనడియన్లు ఎలా జీవించగలుగుతున్నారోనని చాలా మంది సామాజిక మాధ్యమాల్లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నిత్యావసరాలపై జీఎస్టీ సడలింపు!
వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను ఎదుర్కొనబోతున్న ట్రూడో ప్రభుత్వానికి ఈ సమస్య సవాలు విసురుతున్నది. ప్రజలకు సాంత్వన కలిగించడం కోసం ప్రభుత్వం కోట్లాది డాలర్ల ప్యాకేజీని ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిత్యావసర వస్తువులపై జీఎస్టీని సడలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. బట్టలు, నేపీస్, ప్రీ-మేడ్ హాట్ మీల్స్ వంటివాటిపై పన్నులు తగ్గిస్తారని సమాచారం. నిత్యావసర వస్తువుల ధరాభారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని ప్రజ లు చాలా కాలం నుంచి కోరుతున్నారు.