Gold Imports | న్యూఢిల్లీ, జూన్ 17: గత ఆర్థిక సంవత్సరం (2023-24) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి భారత్‌కు బంగారం, వెండి దిగుమతులు పోటెత్తాయి. గతంతో పోల్చితే ఏకంగా 210 శాతం ఎగిసి 10.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. యూఏఈతో భారత్‌కున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే (ఎఫ్‌టీఏ) ఇందుకు కారణమని సోమవారం విడుదలైన గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక చెప్తున్నది. ఈ క్రమంలో యూఏఈతో ఉన్న ఎఫ్‌టీఏ నిబంధనల్ని సవరించాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ ఆర్థిక మేధో దిగ్గజం అభిప్రాయపడింది. ఇక భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కింద ఇస్తున్న కస్టమ్స్ సుంకాల రాయితీపై పునరాలోచనలు చేసుకోకపోతే ఇబ్బందులేనని కూడా హెచ్చరించడం గమనార్హం. ప్రస్తుతం సీఈపీఏ కింద యూఏఈ నుంచి దేశంలోకి ఎంతైనా వెండి దిగుమతి చేసుకోవచ్చు. సాధారణంగా వర్తించే కస్టమ్స్ సుంకం కూడా 7 శాతం తక్కువే. దీనివల్ల గత ఆర్థిక సంవత్సరం ఖజానాకు రూ.1,010 కోట్ల ఆదా యం దూరమైందని జీటీఆర్ఐ తెలిపింది. 160 టన్నుల పుత్తడి దిగుమతిపై సుంకాల్లో 1 శాతం రాయితీ వస్తున్నది. 2022 ఫిబ్రవరిలో సీఈపీఏపై ఇరు దేశాల సంతకాలు జరిగాయి. అదే ఏడాది మే నెల నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చింది.
స్మగ్లింగ్‌కు చెక్ పెట్టాలి
అధిక దిగుమతి సుంకాలతో దేశంలోకి బంగారం, వెండి స్మగ్లింగ్ పెరుగుతున్నదని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాత్సవ అన్నారు. ప్రస్తుతం 15 శాతంగా సుంకం ఉన్నదని గుర్తుచేశారు. దీన్ని 5 శాతానికి తగ్గిస్తే స్మగ్లింగ్ పెద్ద ఎత్తున తగ్గుతుందని సూచించారు. కాగా, అంతకుముందుతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం భారత్‌లోకి యూఏఈ నుంచి జరిగిన మొత్తం దిగుమతులు 9.8 శాతం పడిపోయాయి. 2022-23లో 53.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023-24లో 48 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. అయినప్పటికీ ఇదే సమయంలో బంగారం, వెండి దిగుమతులు 3.5 బిలియన్ డాలర్ల నుంచి 10.7 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఆభరణాల వాటా కూడా ఇందులో పెద్ద ఎత్తునే ఉన్నది.
గిఫ్ట్ సిటీ సెగ
గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలోగల ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్సేంజ్ (ఐఐబీఎక్స్) ద్వారా కూడా యూఏఈ నుంచి పసిడి, వెండి దిగుమతులు చేసుకొనేలా ప్రైవేట్ సంస్థలకు మోదీ సర్కారు అవకాశం ఇచ్చింది. అంతకుమందు ఆథరైజ్డ్ ఏజెన్సీలకే ఈ వీలుండేది. ఫలితంగా దేశ వాణిజ్య లోటు పెరిగిపోతున్నది. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలోని గిఫ్ట్ సిటీ ఉన్నతికి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయిప్పుడు.