హైదరాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ): పెట్టుబడులు ఆకట్టుకోవడంలో రాష్ట్రం దూసుకుపోతున్నది. తాజాగా యూఏఈకి చెందిన శైవ గ్రూపు, తారనిస్ క్యాపిటల్‌లు సంయుక్తంగా రూ.2,125 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇందుకు రాష్ర్టానికి చెందిన ఐదు స్థానిక కంపెనీలతో ఈ రెండు అరబ్ సంస్థలు అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ఈ పెట్టుబడులతో కొత్తగా 5 వేల మందికి పైగా తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.
వీటిలో శైవ గ్రూపు, తారనిస్ క్యాపిటల్ సంయుక్తంగా రివిలేషన్ బయోటెక్‌లో రూ.1,360 కోట్లు పెట్టుబడులు పెట్టబోతుండగా.. మనాకిన్ బయో రూ.340 కోట్లు, స్వబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజర్స్ రూ.80 కోట్లు, ఎగ్జిజెంట్ డ్రిల్లింగ్ టెక్నాలజీ రూ.90 కోట్లు, యెంత్రా టెక్ కంట్రోల్స్ రూ.255 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని మంత్రి చెప్పారు. దీంతోపాటు వచ్చే మూడేండ్లలో బయోటెక్, ఏఐ, డాటా సెంటర్, డిఫెన్స్, ఎనర్జీ, ఫిన్‌టెక్ తదితర రంగాల్లో రూ.24 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు శైవ, తారనిస్ క్యాపిటల్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు శ్రీధర్ బాబు వెల్లడించారు. అలాగే ఈ రెండు సంస్థలు వచ్చే మూడేండ్లలో బయోటెక్ రంగంలో తినుబండారాల్లో చక్కెర శాతాన్ని తగ్గించడం, యాంటీ డయాబెటిక్, ఫుడ్ మేనేజ్మెంట ఉత్పత్తులు, ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ రంగాల్లోవున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి శైవ గ్రూపు చైర్మన్, సీఈవో అమిత్ జగన్నాథ్ వర్మ, తారనిస్ క్యాపిటల్ సీఈవో నికోలస్ ఎస్.బింగ్ హామ్, రివిలేషన్స్ బయోటెక్ ఎండీ రవిచంద్ర బీరం, మనాకిన్ బయో డైరెక్టర్ జశ్వంత్ ప్రణవ్ యతిరాజం, స్వబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజర్స్ సీఈవో సంకర్ష్ చందా, ఎగ్జిగెంట్ డ్రిల్లింగ్ టెక్నాలజీ డైరెక్టర్ పాండురంగా రావు తదితరులు హాజరయ్యారు.