లక్నో: కుమార్తెతో యువకుడి ప్రేమ సంబంధంపై ఆమె తండ్రి ఆగ్రహించాడు. రాత్రివేళ యువతిని కలిసేందుకు ప్రయత్నించిన అతడ్ని గన్తో కాల్చి చంపాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు యువతి తండ్రిని అరెస్ట్ చేశారు. (Man Shot Dead) ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఔరైయా జిల్లాకు చెందిన 18 ఏళ్ల లవ్కుష్, ఎటావా జిల్లా ఖేదహేలులోని తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతితో అతడికి ప్రేమ సంబంధం ఏర్పడింది.
కాగా, సోమవారం అర్ధరాత్రి వేళ ఆ యువతి ఇంట్లోకి వెళ్లేందుకు లవ్కుష్ ప్రయత్నించాడు. గమనించిన యువతి తండ్రి అనిల్ కుమార్ ఆగ్రహంతో రగిలిపోయాడు. తుపాకీతో లవ్కుష్పై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్ధం విన్న స్థానికులు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. యువతి ఇంటి వద్ద రక్తం మడుగుల్లో పడి లవ్కుష్ మరణించడాన్ని చూసి షాకయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. యువతి తండ్రి అనిల్ కుమార్ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. లవ్కుష్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.