న్యూఢిల్లీ, నవంబర్ 10: కేంద్ర ప్రభుత్వ విధివిధానాలు, నిర్ణయాలపై సాధారణ ప్రజానీకమేగాదు.. సర్కారీ సంస్థల అధిపతులూ అసహనం ప్రదర్శిస్తున్నారు. బీమా, పెట్టుబడుల దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) చైర్మన్ ఎంఆర్ కుమార్.. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బాదుడును ప్రశ్నించారు. బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారని, మరీ ఇంతనా? అంటూ విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఇది చాలాచాలా ఎక్కువని విమర్శించారు. బీమా పాలసీలపై పన్నును తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఇటీవలే ఓ బీమా సదస్సులో బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ మాజీ సభ్యుడు నీలేశ్ సాథీ సైతం ఇలాగే స్పందించారు. ఇప్పుడు ఆయనతో కుమార్ ఏకీభవించడం గమనార్హం. ‘పాలసీదారులు చెల్లించే వార్షిక ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ పడుతున్నది. ఇది చాలా ఎక్కువ. ఈ దేశంలో ప్రతీ పౌరునికి బీమా అవసరం ఎంతో ఉన్నది. కాబట్టి ఈ స్థాయిలో జీఎస్టీ భారం తగదు’ అని ఓ తాజా ఇంటర్వ్యూలో కుమార్ అన్నారు. ఇప్పటికీ భారత్లో బీమాను సంస్థలు తమ ఏజెంట్ల ద్వారా తిరిగితిరిగి అమ్ముకోవాల్సి వస్తున్నదని, ప్రజలు తమంతట తామే కొనే పరిస్థితి లేదన్నారు. ఇలా పన్నులు బాదితే బీమాపట్ల ప్రజల్లో మరింత అనాసక్తి ఏర్పడే ప్రమాదం ఉందంటూ కుమార్ ఒకింత ఆందోళన కనబరిచారు.
నిజానికి చాలా పాత పాలసీలపై జీఎస్టీని ఎల్ఐసీనే భరిస్తున్నదన్నారు కుమార్. చేసేది ఏమీలేకనే చివరకు పాలసీదారులపై జీఎస్టీ భారాన్ని మోపాల్సి వచ్చిందని కూడా చెప్పారు. అధిక పన్ను వల్ల అటు సంస్థ, ఇటు సామాన్య ప్రజలూ నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే జీఎస్టీని తగ్గిస్తే మరిన్ని పాలసీలను సంస్థ అమ్మగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి కొత్త బీమా ప్రీమియంల్లో వృద్ధిరేటు పడిపోతున్న వేళ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
‘బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ దారుణం. బ్యాంకింగ్ లేదా మ్యూచువల్ ఫండ్ సర్వీసులపై ఇంత పన్ను వేయడం లేదు. మరే ఇతర ఆర్థిక సేవలపైనా కనిపించదు. కానీ బీమాపైనే ఈ భారమెందుకో నాకు అర్థం కావడం లేదు. అదికూడా ఈ స్థాయిలో వేస్తారా’ -నీలేశ్ సాథీ, ఐఆర్డీఏఐ మాజీ సభ్యుడు