రామగిరి/అడ్డగూడూరు, ఫిబ్రవరి 18 : దళితుడి హత్య కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు 18 మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేటలో 2017 సెప్టెంబర్ 30న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బట్ట లింగయ్య జమ్మిచెట్టు వద్దకు వెళ్లి వస్తుండగా.. అప్పటి సర్పంచ్ పోలెబోయిన లింగయ్య ప్రోద్బలంతో అతడి అనుచరులు కొంతమంది అతడిని దూషించారు. అంతటితో ఆగకుండా దాడి చేసి బట్ట లింగయ్యను హత్య చేసినట్టు ఆయన కుమారుడు బట్ట వెంకన్న అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అడ్డగూడూరు పోలీసులు 18 మంది నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు తర్వాత కోర్టుకు అప్పగించారు. సుదీర్ఘ విచారణ అనంతరం నల్లగొండ ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి, రెండో అదనపు జడ్జి ఎన్ రోజారమణి మంగళవారం 18 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుల్లో జక్కుల భిక్షమయ్య అనారోగ్యంతో మరణించాడు. మిగిలిన 17మందికి జీవిత ఖైదీతోపాటు ఒక్కొక్కరికి రూ.6 వేల జరిమానా విధించారు.
జంట హత్యల కేసులో జీవిత ఖైదు
వినాయక్‌నగర్ : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసులో కవలల కేసుకు సంబంధించి తీర్పు వెలువడింది. ఇందులో తల్లి, కుమారుడికి జీవితఖైదు పడింది. ఇన్చార్జి సీపీ సింధూశర్మ తెలిపిన వివరాలు.. మాక్లూరు మండలానికి చెందిన పూన ప్రసాద్ కుటుంబం హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆస్తి కోసం ప్రసాద్‌తోపాటు అతని భార్య రమణి, కవలు చైత్రిక, చైత్రిక్, చెల్లెళ్లు శ్రావణి, స్వప్నను అదే మండలానికి చెందిన మేడిద ప్రశాంత్, అతని తల్లి ఒడ్డెమ్మ దారుణంగా హతమార్చి వేర్వేరు ప్రదేశాల్లో పడేశారు. దీనిపై 2023 డిసెంబర్ 4న కేసు నమోదు చేసిన మెండోరా పోలీసులు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల.. కవల పిల్లలకు సంబంధించిన కేసు విచారణ జరిపి.. తల్లి ఒడ్డెమ్మ, కుమారుడు ప్రశాంత్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు. మిగతా నాలుగు హత్య కేసుల విచారణ కొనసాగుతున్నదని ఇన్చార్జి సీపీ సింధూశర్మ తెలిపారు.