సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జనవరి 1న జరిగిన గ్యాంగ్‌వార్‌లో ఒకరు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో గురువారం పోలీసులు 18 మందిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఖాళీ స్థలంలో వేడుకలు..
కర్మన్‌ఘాట్‌కు చెందిన నరసింహారెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకొని గత శనివారం తన స్నేహితులు గౌసు, రాఘవేంద్ర, సాయిలకు ఎల్బీనగర్ కేకే గార్డెన్స్ వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో దావత్ ఇచ్చాడు. అక్కడ మద్యం తాగారు. మరో స్నేహితుడు తిలక్ గౌడ్ అందులో చేరాడు. సాయంత్రం అదే ఖాళీ స్థలంలో స్థానికులు మాలిక్, మిట్టు, రాఘవలు కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకొంటూ.. తాగారు. వీరి గ్రూపులోకి తిలక్ వచ్చి కొద్ది సేపు మద్యం సేవించాడు.
‘నాకన్నా మద్యం ఎక్కువగా తాగావు..లేదు లేదు నాకు తక్కువగా మద్యం పోశారం’టూ వారి మధ్య గొడవ మొదలైంది. చివరికి గ్యాంగ్‌వార్‌కు దారితీసింది. నరసింహారెడ్డి గ్రూపులో ఐదుగురు ఉండగా, మాలిక్ తన సోదరుడు గౌతమ్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో గౌతమ్ తన స్నేహితులను తీసుకుని కార్లలో వచ్చి.. రాళ్లు, కర్రలతో నరసింహారెడ్డి గ్రూపుపై దాడికి దిగారు. నరసింహారెడ్డి కిందపడిపోగా, మాలిక్ అనుచరులు ఇష్టానుసారంగా చితకబాదారు. గౌసు, రాఘవ, సాయిలకు తీవ్ర గాయాలవ్వగా, నరసింహారెడ్డి మృతిచెందాడు.
నిందితులపై వివిధ సెక్షన్ల కింద..
హత్యకు పాల్పడ్డ బాలం మాలిక్రాజ్ అలియాస్ మానిక్, బాలం గౌతమ్, మహేశ్వరం గణేశ్ అలియాస్ మిట్టు, మేక్కొండ మనోజ్, సోనామోని అనిల్‌కుమార్, నల్లా సృజన్‌కుమార్, వరికుప్పల రమేశ్, చేగొని నాగేందర్ గౌడ్, నరేశ్, సాయికిరణ్, ప్రశాంత్, నవీన్ యాదవ్, మహ్మద్ ఫయాజ్ ఖాన్, మొగిల రాజు, గొడుగు విజయ్‌కుమార్, నలగుట్ట రాఘవచారి, భరత్, శరత్‌కుమార్‌ల పై ఐపీసీ సెక్షన్లు 302,307, 147,148, 504, 149 ల కింద అభియోగాలను నమోదు చేశారు. 18 మందిని అరెస్టు చేయగా మహేశ్ గౌడ్, కార్తీక్, భార్గవ్ పరారీలో ఉన్నారు. అరెస్టయినవారిలో బాలం మాలిక్ అలియాస్ మానిక్, మహేశ్వరం గణేశ్, మెక్కొండ మనోజ్‌లకు నేర చరిత్ర ఉంది.
రికార్డింగ్‌లు లభ్యం
‘మన వాడిని కొట్టాడు రా…అందరూ రండి…అవతలి గ్రూపులో ఎవరిని వదలద్దు. మనం ఏంటో తెలియాలి’ అంటూ ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణలను పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అరస్టైన నిందితుల ఫోన్లలో ఇతర బెదిరింపులకు సంబంధించిన ఆడియోలు కూడా లభ్యమయ్యాయి.