అంబర్‌పేట, నవంబర్ 20: మద్యం షాపుల లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 179 మద్యం షాపులకు గాను 3546 దరఖాస్తులు రాగా అంబర్‌పేట ఛే నంబర్లోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో శనివారం లక్కీ డ్రా నిర్వహించారు. 178 షాపులను కేటాయించారు. చార్మినార్ ఏరియాలో ఒక షాపునకు తక్కువ దరఖాస్తులు వచ్చాయన్న కారణంలో ఎక్సైజ్ అధికారులు డ్రాను ఆపేశారు. హైదరాబాద్ జిల్లా సగటు దరఖాస్తుల సంఖ్య 22. కానీ చార్మినార్ ఏరియా షాపునకు కేవలం పది దరఖాస్తులే రావడంతో అధికారులు డ్రాను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.
యూనిట్ల వారీగా..
హైదరాబాద్‌ను సికింద్రాబాద్, హైదరాబాద్ యూనిట్లుగా విభజించిన అధికారులు లాటరీ విధానంలో దుకాణాలను కేటాయించారు. సికింద్రాబాద్ యూనిట్లో మొత్తం 99 మద్యం షాపులుంటే మొత్తం 1776 దరఖాస్తులు రాగా.. ఇందులో నారాయణ గూడ(గెజిట్ నం.95) షాపునకు అత్యధికంగా 35.. ఇతర షాపులకు 15 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. సికింద్రాబాద్ యూనిట్ డ్రాను రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ సెక్రటరీ ఎం. రఘనందన్ రావుతో పాటు ఆ యూనిట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, ఎస్టీఎఫ్ పవన్‌కుమార్ పర్యవేక్షించారు.
హైదరాబాద్ యూనిట్ పరిధిలో 80 షాపులుంటే 79 షాపులకు మాత్రమే డ్రా తీశారు. మొత్తం 80 షాపులకు 1772 దరఖాస్తులు వచ్చాయి. బంజారాహిల్స్‌లోని ఓ ఏరియా షాపునకు అత్యధికంగా 40 దరఖాస్తులు రాగా.. మిగిలిన వాటికి 15 చొప్పున వచ్చాయి. ఈ యూనిట్లో ఎస్టీ 1, ఎస్సీ 5, గౌడ్స్‌కు 4 చొప్పున రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. మహిళలు పదిశాతం చొప్పున షాపులు దక్కించుకున్నారు.
విచారణ జరిపి డ్రా తీస్తాం..
చార్మినార్ ఏరియాలోని ఓ షాపునకు కేవలం పది దరఖాస్తులు రాగా డ్రా నిలిపేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. తప్పుడు దరఖాస్తులు వచ్చాయని భావిస్తున్నామని.. దీనిపై విచారణ జరిపి డ్రా తీయడమా? లేదా తిరిగి నోటిఫికేషన్ వేయడమా? అన్నది త్వరలో నిర్ణయిస్తామన్నారు.
ఆరుగురికి 12 షాపులు..
మేడ్చల్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ)/ కుత్బుల్లాపూర్: మేడ్చల్ జిల్లాకు చెందిన మద్యం దుకాణాల లక్కీ డ్రాను కొంపల్లిలోని కేవీఆర్ కన్వెన్షన్‌లో కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మేడ్చల్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలో 114, మల్కాజిగిరి పరిధిలో 88 దుకాణాలుండగా మొత్తం 202 షాపులకు 6272 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 35 మంది మహిళలు, 167 పురుషులకు దక్కాయి. మరో ఆరుగురు రెండు చొప్పున షాపులు దక్కించుకున్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి డివిజన్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య, మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.విజయ భాస్కర్, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఎంపిక
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్
ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని రిటైల్ మద్యం షాపులను లాటరీ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ శర్మన్ తెలిపారు. శనివారం అంబర్‌పేటలోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మొత్తం 179 షాపుల్లో 178 షాపులను లక్కీ డీప్ ద్వారా ఎంపిక చేశామన్నారు. ఒక్క షాపునకు మాత్రం లాటరీ తీయలేదన్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాతే డ్రా తీస్తామన్నారు. అయితే ఆ షాపు కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆందోళన చేయాల్సిన
అవసరం లేదన్నారు.