Shimla : హిల్ స్టేషన్‌గా, బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌గా పేరుపొందిన షిమ్లాకు శనివారం భారీగా వాహనాలు పోటెత్తాయి. ఒక్కరోజే ఏకంగా 16,000కుపైగా వాహనాలు షిమ్లాలోకి ప్రవేశించినట్లు అక్కడి ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన షిమ్లాకు పర్యాటకులు నిరంతరం వస్తూ ఉంటారు.
అందులోనూ వీకెండ్ కావడంతో భారీగా జనాలు వాహనాలతో షిమ్లా చేరుకున్నారని అధికారులు అంటున్నారు. 15-20 నిమిషాలు పట్టే దూరానికి ఇప్పుడు గంటకుపైగా సమయం పడుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాల నుంచే కాకుండా ఉత్తరాఖండ్, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలైన షిమ్లాతోపాటు కులు-మనాలి, షిమ్లా, నైనిటాల్, భిమ్టాల్, కైంచి ధామ్‌లకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. రోహ్తక్లో మంచు కురవడం, లాహల్-స్పితి ప్రాంతంలో శీతల వాతావరణం ఉండటంతో ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి పర్యాటకులు వస్తున్నారు.
ఈ రోడ్డు మార్గం మనాలి నుంచి సోలాంగ్ వ్యాలీకి, హిడింబా దేవి ఆలయాన్ని కలుపుతుంది. సాధారణంగా రోజుకు పదివేల వాహనాలు వస్తుంటాయని, కానీ, ఈ రోజు 16,000కుపైగా వాహనాలు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో పావుగంట పట్టే ప్రయాణం ఇప్పుడు గంట నుంచి రెండు గంటలు పడుతుందని చెప్పారు. భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వాహనాలు ఏ అవాంతరం లేకుండా కదిలేలా ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.