Mexico Train Derailment | మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒక్సాకాలో ఇంటర్ఓషియానిక్ ప్యాసింజర్ రైలు ఆదివారం పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. మరో 98 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
సుమారు 250 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందితో ఆదివారం బయల్దేరిన రైలు.. Asuncion Ixtaltepec సమీపంలోని నిజాండా వద్ద పట్టాలు తప్పిందని అధికారులు వెల్లడించారు. రైలు పట్టాలు తప్పిందని సమాచారం అందుకున్న మెక్సికన్ ఆర్మీ, సివిల్ ప్రొటెక్షన్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న ప్రయాణికులను వెలికితీశారు. వారిలో 139 మంది సురక్షితంగా బయటపడ్డారని, 98 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
Me informa la Secretaría de Marina que en el accidente del Tren Interoceánico lamentablemente fallecieron 13 personas; 98 están lesionadas, cinco de ellas de gravedad. Los heridos se encuentran en hospitales del IMSS en Matías Romero y Salina Cruz, así como de IMSS-Bienestar en…
— Claudia Sheinbaum Pardo (@Claudiashein) December 29, 2025
కాగా, రైలు ప్రమాదంపై మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షిన్బామ్ పార్డో విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాధిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ఉన్నతాధికారులను ఘటనాస్థలికి పంపించినట్లు పేర్కొన్నారు. రైలు ప్రమాదంపై ఓక్సాకా గవర్నర్ సాలోమన్ జారా క్రూజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఫెడరల్ ఏజెన్సీలతో కలిసి సహాయక చర్యలు, వైద్య సేవలు సమన్వయం చేసుకుంటామని తెలిపారు. రైలు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని మెక్సికో అటార్నీ జనరల్ ఎర్నేస్టినా గోడోయ్ రామోస్ తెలిపారు.

Mexico Train Derailment1