Sudeep | కన్నడ చిత్రసీమ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన స్టార్ హీరోల్లో కిచ్చా సుదీప్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన ప్రతిభ, కష్టం, పట్టుదలతో శాండిల్‌వుడ్‌లో అగ్రనటుడిగా ఎదిగిన సుదీప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీల మధ్య ఉండాల్సిన పరస్పర సహకారంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుదీప్, కన్నడ నటులు ఇతర భాషా సినిమాల్లో అతిథి పాత్రలు, కీలక పాత్రలు చేయడానికి ఎప్పుడూ వెనుకాడలేదని తెలిపారు. అయితే అదే స్థాయిలో ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి కన్నడ సినిమాలకు సహకారం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నేను వ్యక్తిగతంగా అడిగినా కూడా ఇతర భాషల స్టార్ హీరోలు మా సినిమాల్లో చిన్న పాత్రలు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. ఇది ఇండస్ట్రీల మధ్య ఉండాల్సిన సహాయ సహకారాల్లో ఉన్న లోపాన్ని చూపిస్తోంది అని సుదీప్ వ్యాఖ్యానించారు. తాను తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో ఎన్నోసార్లు అతిథి పాత్రలు చేశానని, కొన్ని సినిమాల్లో స్నేహం కోసమే పారితోషికం కూడా తీసుకోకుండా నటించానని సుదీప్ వెల్లడించారు. డబ్బుకంటే నాకు ఫ్రెండ్షిప్ ముఖ్యం. సల్మాన్ ఖాన్ వ్యక్తిగతంగా అడిగినందుకే ‘దబాంగ్ 3’లో నటించాను. విజయ్ కోసం ‘పులి’ సినిమాలో చేశాను. అతనిలోని వినయం, మంచి మనసు నాకు చాలా ఇష్టం అని చెప్పారు. అలాగే శివరాజ్‌కుమార్ కూడా ఇతర భాషా సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇండస్ట్రీలో కొందరు స్టార్స్ మాత్రమే కాలాన్ని తట్టుకుని నిలుస్తారని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి వారు జీవితాంతం నటిస్తూ అభిమానుల ప్రేమ పొందుతారని సుదీప్ వ్యాఖ్యానించారు.
అదే సమయంలో చాలా మంది స్టార్స్ ఒక దశ తర్వాత కనుమరుగైపోతారని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీశాయి. సుదీప్ వ్యాఖ్యలు వైరల్ కావడానికి మరో ప్రధాన కారణం ఆయనకు తెలుగులో ఉన్న భారీ క్రేజ్. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన సుదీప్, ఆ చిత్రంలో విలన్ పాత్రలో నటించి నంది అవార్డ్‌ను కూడా అందుకున్నారు. అలాగే ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘సైరా నర్సింహారెడ్డి’ వంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి తన సత్తా చాటారు. ప్రస్తుతం కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్న కిచ్చా సుదీప్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.