sexual harassment : న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఒక ప్రొఫెసర్ తమను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు 10 మంది విద్యార్థినులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీసీ) వద్ద విద్యార్థినులు ఫిర్యాదు చేయగా.. విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫిర్యాదు ప్రకారం.. ఒక ప్రొఫెసర్ తన విద్యార్థినుల్ని ప్రైవేట్ మీటింగ్ కోసం తన ఇంటికి రమ్మని పిలిచేవాడు. అలాగే, అక్కడ విద్యార్థినులతో అభ్యంతరకరంగా ప్రవర్తించేవాడు. క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్నప్పుడు కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడేవాడు. దీంతో ఈ వేధింపులను కొంతకాలం భరించిన విద్యార్థినులు నెల రోజుల క్రితమే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం యూనివర్సిటీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారా.. లేదా అనే విషయాలు తెలియవు. అలాగే, విచారణలో ఏం తేలింది.. సంబంధిత ప్రొఫెసర్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే విషయంలో కూడా యూనివర్సిటీ అధికారులు స్పష్టతనివ్వాల్సి ఉంది. ఈ అంశంపై కమిటీతోపాటు, పూర్వ విద్యార్థులు కూడా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.