
సిటీబ్యూరో/మన్సురాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): అతడికి పుట్టిన రోజే చివరిదైంది.. స్నేహితుల మధ్య చెలరేగిన గొడవను ఆపుదామని వెళ్లి.. వారి చేతిలోనే హతమవ్వడం విషాదాన్ని నింపింది. శనివారం రాత్రి మద్యం మత్తులో జరిగిన స్ట్రీట్ ఫైట్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఈ గ్యాంగ్‌వార్‌లో గొడవకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…కర్మన్‌ఘాట్ సుభోదయనగర్ కాలనీ రోడ్డు నం. 13 ప్రాంతానికి చెందిన వ్యాదుగుల నర్సింహారెడ్డి(33) ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. శనివారం అతడి జన్మదినం కావడంతో మధ్యాహ్నం తన స్నేహితులు రాఘవేంద్ర, సాయి, గౌసులతో కలిసి కేకే గార్డెన్ వెనుకాల ఉన్న ఖాళీ స్థలంలో పార్టీ చేసుకొని.. మద్యం సేవించారు. సాయంత్రం 4 గంటల సమయంలో తిలక్ కూడా వచ్చి చేరాడు. అదే స్థలంలో సాయంత్రం 7 గంటల సమయంలో పక్క కాలనీలో ఉండే మానిక్, మిట్టు, రాఘవ మందు పార్టీ చేసుకున్నారు. వీరు తిలక్‌కు స్నేహితులు కావడంతో అతడు కూడా వెళ్లి.. మళ్లీ తాగాడు.
ఆ సమయంలో తిలక్, మానిక్ గొడవపడ్డారు. మానిక్, అతడి స్నేహితులు తిలక్‌ను కొట్టి..ఫోన్‌ను గుంజుకున్నారు. గమనించిన నర్సింహారెడ్డి, మానిక్‌తో మాట్లాడి ఫోన్‌ను తిరిగి ఇప్పించి.. తిలక్‌ను ఇంటికి పంపించాడు. అయితే తిలక్ తన బావ బన్నుకు ఈ విషయం చెప్పి.. తిరిగి అక్కడికి తీసుకొచ్చాడు. ఈ సమాచారం తెలుసుకున్న మానిక్ తన సోదరులు మనోజ్, గౌతమ్‌లతో పాటు బంధువులు, స్నేహితులను పిలిపించాడు. ఇలా గౌతమ్, మనోజ్ కారులో వచ్చి రాగానే తిలక్, బన్నుల పై కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడికి దిగారు. గమనించిన నర్సింహారెడ్డి, గౌసు, రాఘవేందర్ గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ.. మానిక్ , గౌతమ్, మనోజ్ వారి గ్యాంగ్ వీరిని కూడా చితక బాదారు. దెబ్బలు తాళలేక నర్సింహారెడ్డి కిందపడిపోగా, అయినా వదిలిపెట్టక కాళ్లతో తన్నడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతను అలా పడి ఉండగానే.. ప్రత్యర్థి గ్యాంగ్ నర్సింహారెడ్డి స్నేహితులు గౌసు, రాఘవేంద్రలను కూడా బాగా కొట్టారు. తిలక్, బన్ను, రాఘవేంద్ర, గౌసు అక్కడికి నుంచి వెళ్లి.. నర్సింహారెడ్డి సోదరుడు హనుమంతరెడ్డికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. అతడు ఘటన స్థలానికి చేరుకొని.. నర్సింహారెడ్డిని స్థానిక దవాఖానకు తరలించాడు. పరీక్షించిన వైద్యుడు చనిపోయాడని ధ్రువీకరించాడు. హనుమంతరెడ్డి ఎల్బీనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.
ఆరుగురికి గాయాలు..
ఈ గొడవలో నర్సింహారెడ్డి మరణించగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గొడవ సమాచారం అందుకొని వచ్చిన బన్ను తండ్రి శివకుమార్‌పై కూడా మనోజ్, గౌతమ్ దాడి చేసి.. తీవ్రంగా గాయపర్చారని దర్యాప్తులో తేలింది. దాడికి దిగిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ..మరికొందరు కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులు ఉపయోగించిన వాహనాలతో పాటు దాడికి దిగిన మిగతా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎదురింటి వారే..
ఈ గ్యాంగ్ వార్‌కు తిలక్, మానిక్ మధ్య ఉన్న పాత గొడవలే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మద్యం సేవించినప్పుడు తిలక్.. వారి దగ్గర కూర్చోవడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఒకరికొకరు తిట్టుకోవడంతో ఘర్షణకు దారి తీసింది. ఆ తర్వాత వ్యవహారాన్ని బయట ఉన్న స్నేహితులకు చెప్పడంతో ఎవరికీ వారు ఆధిపత్యం చెలాయిద్దామని గ్యాంగ్‌లతో కార్లలో సంఘటన స్థలానికి వచ్చి..ఘర్షణపడ్డారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో రోడ్లపైకి వచ్చి..మళ్లీ కొట్టుకున్నారని సమాచారం.