సాహితీ సమరాంగణ సార్వభౌముడు అంటే ఈ కాలంలో కేసీఆర్ గుర్తుకు వస్తారు. సాహిత్యంపై ఆయనకున్న పట్టు, అభిరుచి అంతటిది. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక పెట్టే ముందు ఒకసారి పాత్రికేయులతో మాట్లాడుతున్న సందర్బమది. ఒక పాత్రికేయుడు ప్రతి వారం తెలంగాణ కథ ప్రచురిద్దాం అన్నాడు. వెంటనే కేసీఆర్ ‘కథకు తెలంగాణ ఆంధ్ర అని ఉంటుందానండి… ప్రపంచ సాహిత్యం అంతా గొప్పదే. శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి కథలు బాగుంటాయి. ఆంధ్రా అని బాగలేవంటామా’ అన్నారు. ఉద్యమ సమయంలో ఒకరు తెలంగాణలో పాటల గురించి తెలిసీ తెలువకుండా ఏదో చెప్పారు. వెంటనే కేసీఆర్ తెలంగాణలో ఉన్న అనేక విధాల పాటల గురించి ఒక్క బిగిలో చెప్పారు. తొట్లెలో జోల పాట మొదలుకొని, అంతిమ యాత్ర వరకు ఎన్ని రకాల పాటలుంటాయో జాబితా చదివినట్టు వివరించారు. వడ్లు దంచుతున్నప్పుడు పాట, పొలంలో పనిచేస్తున్నప్పుడు పాట, పెళ్ళి పాటలు- ఇట్లా దాదాపు ముప్పై రకాల పాటల గురించి ఏకధాటిగా చెబుతూ పోయారు. ‘బాల రసాల సాల నవ పల్లవ… నిజ ర సుతోదర పోషణార్థమై’ అంటూ ఆయన పోతన కవిత్వం, తెలుగు సాహిత్యం గురించి తెలుగు మహాసభల్లో చేసిన ప్రసంగాన్ని మెచ్చుకోని సాహితీవేత్తలు లేరు. ఆరంభింపరు నీచ మానవులు…, ఒకచో నేలను పవ్వళించు… మొదలైన పద్యాల ద్వారా ఉద్యమ సమయంలో ప్రజలకు ధైర్యం నూరిపోశారు.
ఈ అడవి మనది, ఎవరిదో కాదు. చిన్నపుడు ఎన్ని రకాల పండ్ల చెట్లు ఉండె. మనం తినే పండ్లు వేరే ఉంటయి. కోతులు గానీ, ఇతర పక్షులు గానీ తినేవి వేరే ఉంటయి. కోతులు ఆడనే తినేవి. ఏర్ల నీళ్లు తాగి మంచిగ ఆడనే ఉండేవి. అవన్నీ మనం కట్ చేసినం. అవి వచ్చి మన పంటల్ని కట్ చేస్తున్నయి.
- కేసీఆర్