కామారెడ్డి/ కామారెడ్డి రూరల్/ బీబీపేట/ మాచారెడ్డి/ దోమకొండ/ నాగిరెడ్డిపేట/ రామారెడ్డి/ లింగంపేట/ నిజాంసాగర్ /తాడ్వాయి, నవంబర్ 16 : అకాల వర్షం అన్నదాత పాలిట శాపంగా మారింది. కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో కొనుగోలు కేం ద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. పలు గ్రామాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినప్పటికీ మిల్లర్లు సకాలంలో లారీలు పంపకపోవడంతో అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ అడ్లూర్ గ్రామ రైతులు నిరసన తెలిపారు. కామారెడ్డి మండలంలోని శాబ్దీపూర్, గర్గుల్, సరంపల్లి, పాతరాజంపేట్ తదితర గ్రామాల్లో ధాన్యం తడిసినట్లు రైతులు తెలిపారు. రామారెడ్డి మండలంలోని రామారెడ్డి, ఇసన్నపల్లి, అన్నారం, రెడ్డిపేట్, సింగరాయిపల్లి తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోయింది.
బీబీపేటతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. పూర్తిగా ఎండిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మాచారెడ్డి మండలంలోని భవానీపేట, పాల్వంచ, ఘన్పూర్(ఎం), మాచారెడ్డి సొసైటీ వద్ద ఉన్న ధా న్యం కుప్పలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. దోమకొండలోని కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, విండో చైర్మన్ నాగరాజు, ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్, ఉపసర్పంచ్ శ్రీకాంత్, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. నాగిరెడ్డిపేట మండలంలోని పలుచోట్ల కురిసిన అకాల వర్షంతో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. లింగంపేట మండలంలోని నల్లమడుగు, శెట్పల్లిసంగారెడ్డి, లింగంపేట కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. నిజాంసాగర్ మండల కేంద్రంతోపాటు మహ్మద్‌నగర్, నర్వలో కొనుగోలు కేంద్రంలోని వడ్లు తడిసిపోయాయి. తాడ్వాయి మండలంలోని క్రిష్ణాజివాడి, తాడ్వా యి, బ్రాహ్మణపల్లి, ఎర్రాపహాడ్, నందివాడ, సోమారం, దేమికలాన్, చిట్యాల, సంతాయిపేట్ గ్రామాల్లో వడ్లు తడిసిపోయాయి.
కామారెడ్డి జిల్లాలో వర్షపాతం వివరాలు
కామారెడ్డి జిల్లాలో 501.2మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి మండల పరిధిలో అత్యధికంగా 997.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. మాచారెడ్డిలో 94.2 మి.మీ, దోమకొండలో 64.6మి.మీ, భిక్కనూర్‌లో 28.2 మి.మీ, లింగంపేటలో 18.8 మి.మీ, సదాశివనగర్‌లో 34.4మి.మీ, తాడ్వాయిలో 50.2మి.మీ, ఎల్లారెడ్డిలో 27.0 మి.మీ, నాగిరెడ్డిపేటలో 44.8 మి.మీ, బాన్సువాడలో 6.4మి.మీ, పిట్లంలో 5.4 మి.మీ, గాంధారిలో 13.2 మి.మీ, బీర్కూర్‌లో 3.0 మి.మీ, నిజాంసాగర్‌లో 12.4 మి.మీ, మద్నూర్‌లో 1.0 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా పరిధిలో 14 మండలాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా 3 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది.