వెంగళరావునగర్, ఫిబ్రవరి 23 : డివిజన్ పరిధిలోని మధురానగర్‌లో ఉన్న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ (స్టేట్‌హోం) ప్రాంగణంలో ఉన్న దుర్గబాయి దేశ్‌ముఖ్ మహిళల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు తొలిసారిగా క్రీడల్లో తమ ప్రతిభను చాటారు. 1982లో కళాశాల స్థాపించిన నాటి నుంచి తొలిసారిగా ఈ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల క్రీడల పోటీలు నిర్వహించారు. దాదాపు 9 జిల్లాలకు చెందిన విద్యార్థినులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు ఖోఖో, బ్యాడ్మింటర్ సింగిల్స్, డబుల్స్, జావెలిన్ త్రోలలో బంగారు పతకాలు, లాంగ్‌జంప్, 400 మీటర్లు పరుగు పందెం పోటీల్లో వెండి పతకాలు లభించాయి. అంతేగాక జిల్లాస్థాయిలో ఓవరాల్ చాంపియన్‌షిప్ కూడా లభించింది. దీనిని పురస్కరించుకుని బుధవారం స్టేట్‌హోంలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుజాత విజేతలను అభినందించారు.