స్వభావ రీత్యా కేసీఆర్ సంస్కర్త. ఆయన చేపట్టిన ప్రతి కార్యం వెనుక మనకు కనిపించని ఒక గొప్ప కోణం ఉంటుంది. కుల భవనాల ఏర్పాటు కూడా అటువంటిదే. బంజారా భవన్, ఆదివాసీ భవన్ కేవలం భవనాలు కావు. వాటిని ఆసరాగా చేసుకొని ఆయా సామాజిక వర్గాలు సాంస్కృతికంగా, సామాజి కంగా వృద్ధి చెందుతాయి. వారిలో సంఘటిత శక్తి, అభివృద్ధి కాంక్ష బలపడుతుంది. అన్నిటికి మించి వారిలో స్వాభిమానం నెలకొంటుంది. వివిధ నియామకాలు, కేటాయింపులలో రిజర్వేషన్ పాటించడం, కులవృత్తులకు ప్రోత్సాహం, భారీ ఎత్తున గురుకులాల ఏర్పాటు, దళిత బంధు వంటివి విప్లవాత్మక ఆచరణలు. తెలంగాణ సాధనకు ఆమరణ దీక్షకు ఉపక్రమించడం ఎంతటి మొండిధైర్యమో, ఈ సంఘ సంస్కరణకు దిగడం కూడా అంతటిది. యధాతథ శక్తులు దీనికి అడ్డంకులు సృష్టిస్తాయని తెలిసి కూడా ఆయన సాహసించారు. ఆయన సంస్కరణ ఏ ఒక్క రాజకీయ రంగానికో, సామాజిక రంగానికో పరిమితమైంది కాదు. ప్రతి రంగం లోనూ మార్పు రావాలని తహతహలాడటం ఆయన నైజం. తెలంగాణ చరిత్రలో సాలార్జంగ్ సంస్కరణలను గొప్పగా చెప్పుకుంటారు. కానీ కేసీఆర్ సంస్కరణలు ఒక రంగానికి పరిమితమైనవి కాదు. నీటిపారుదల, వ్యవసాయం, గ్రామపాలన, జిల్లాల పునర్వ్యవస్థీకరణ – ఇట్లా ప్రతి రంగాన్నీ ఆయన పునర్నిర్వచించారు.
అహింసామార్గంలో స్వాతంత్య్రాన్ని సాధించి గాంధీ కొత్త పోరాట పంథాను పరిచయం చేశారు. ఆ మార్గంలోనే శాంతియుతంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. ఉద్యమాన్ని ప్రారంభించే సమయంలో గాంధీ పోరాట వ్యూహరచనను పుణికిపుచ్చుకున్నాం. నా సహచరులు చాలా సందర్భాల్లో నిరాశ, నిస్పృహలకు లోనయినా ఆ పంథా వీడలేదు.
– కేసీఆర్