అతను విష్ణువు – ఆమె లక్ష్మి. అతను సూర్యుడు – ఆమె ఛాయ. ..అన్న రుద్రోపనిషత్ వాక్యం కేసీఆర్, శోభ దంపతులకూ వర్తిస్తుంది. చంద్రశేఖరరావు స్వతహాగా బోళాశంకరుడే. శోభమ్మ అపర పార్వతీదేవి. అన్నపూర్ణకునుద్దియౌ అతని ఇల్లాలు. ముక్కోటి దేవతలూ గరళాన్ని మింగమని శివుడిని కోరినట్టే.. మేధావులూ, విద్యావంతులూ మలిదశ ఉద్యమ బాధ్యతలు స్వీకరించమని అడిగినప్పుడు.. కేసీఆర్ కూడా పరమశివుడిలానే ఇల్లాలి వైపు అనుమతి కోసం చూసే ఉంటాడు. ‘.. మ్రింగెడిదియు గరళమనియు మేలని.. ప్రజకున్ మ్రింగుమనె సర్వమంగళ.. మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో’.. జనం కోసం, జగం కోసం.. హాలాహలాన్ని మింగేయమని చెప్పిన పార్వతమ్మలానే, శోభమ్మ కూడా తెలంగాణ విముక్తి కోసం ఉద్యమ బాధ్యతలు స్వీకరించమని సలహా ఇచ్చి ఉంటారు. కేసీఆర్ ఫ్యామిలీ మ్యాన్. పండగలు, పబ్బాలు పద్ధతి ప్రకారం జరిపిస్తారు. తమ వంశోద్ధారకుడిని తలుచుకొని పుణ్యలోకాల్లోని పెద్దలూ మురిసిపోతుంటారేమో!
ప్రజలు తమ సమస్యలకు తక్షణ పరిష్కారం కోరుకుంటారు. కానీ, పాలకుడు శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చెయ్యాలి. ప్రజలు చెప్పినట్టు వినాలి. అదే సమయంలో ప్రజలను తన మార్గంలోకి తెచ్చుకోవాలి. అది పాలకుడు చేయాల్సిన పని.