వాన పడితే కొందరు తడుస్తారు. మరికొందరు వర్షాన్ని ఆస్వాదిస్తారు! ఈ రెండవ తరహా మనిషి కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ పరిశీలిస్తున్నప్పుడు ఆయన అనుభూతిని పసిగట్టారా! ఆయన ఆ జలరాశిని ఆస్వాదిస్తుంటారు. అగ్నిని పూజిస్తున్నా, నీటికి హారతి పడుతున్నా, నదుల్లో నాణేలు వేసినా, అడవుల గురించి మాట్లాడినా- ఆయనలో ఉద్వేగాలు ఉబికివస్తుంటాయని సన్నిహితులు చెబుతారు. ప్రకృతి అంటే ఆయనకు ప్రాణం. సమస్త జీవ రాశులంటే కరుణ. చెట్లు పెంచాలి, వానలు వాపస్ రావాలి, కోతులు వాపస్ పోవాలి అంటూ లయాత్మకంగా చెప్పడం వెనుక ఆయనలోని ప్రకృతి ప్రేమ ఉన్నది. కోతులు ఎందుకు వస్తున్నయ్? ఎందుకంటే వాటి జాగలకు మనం పోయినం కనుక-అని ఆయన వాడుక భాషలో ప్రజలకు బోధిస్తరు. యాదాద్రి నిర్మాణాన్ని సందర్శించినప్పుడు, ఎక్కడ జాగ ఉంటే అక్కడ చెట్లు పెట్టండని చెప్పారు. నగరాల్లోనూ అడవులు ఉండాలె, అడవుల్లో ఉన్నట్టే నగరవాసం ఉండాలె అంటారాయన. ప్రతి గ్రామంలో నర్సరీ ఉండాలనడమే కాకుండా, చెట్లను పెంచడాన్ని తప్పనిసరి చేశారు. హరితహారం విషయంలోనూ ఆయన పట్టుదలగా ఉన్నారు. ఆయన ఎన్ని ప్రాజెక్టులకు రూపకల్పన చేసినా, వాటి మూలసూత్రం- పచ్చదనం, పల్లెదనం.
సిద్దిపేట నర్సరీలో మొలిచిన మొక్కను నేను. ఇయాల చెట్టోలే పెరిగి తెలంగాణకే నీడనిచ్చే స్థాయికొచ్చిన. పదిహేనేండ్ల క్రితం సిద్దిపేటలో నేను
ఎమ్మెల్యేగా ఉన్నపుడే 10 నిమిషాల్లో 10 వేల మొక్కలు నాటాం. తెలంగాణ రాష్ట్రంలో పోయిన వానలు తిరిగి రావాలంటే విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలి.
– కేసీఆర్