పదాలు పలికే పెదాలు గులాబీరేకుల్లా మెరిసిపోతే అతివ అందం రెట్టింపు అవుతుంది. మోవిపై చిరునవ్వులు ఎప్పుడూ నిలవాలంటే… అధరాలను ఆక్రమించే పిగ్మెంటేషన్‌ను ఆమడ దూరం ఉంచాల్సిందే. పలువలువ పదును తగ్గించి, కళావిహీనంగా మార్చే పిగ్మెంటేషన్‌ను ఛేదించినప్పుడే అవి ఆరోగ్యంగా ఉంటాయి. లిప్‌స్టిక్స్‌తో రంగులద్ది హంగులు చేరుస్తామంటే పెదవికి చేటు తప్పదు. ఇన్ఫెక్షన్లు పలకరించే ప్రమాదం ఉంటుంది. అలా కావొద్దంటే.. మధువులొలకబోసే పెదాల ఆరోగ్యం కోసం ఈ సలహాలు పాటించండి. విటమిన్ బి12, విటమిన్ డి లోపాల కారణంగానే పెదాలపై పిగ్మెంటేషన్ పెరుగుతుంది. ఇక విటమిన్ డి లోపం మొత్తం చర్మ రంగుని ఎఫెక్ట్ చేస్తుంది. బి12 తగ్గినప్పుడు మెలనిన్ సైతం పెరిగే ప్రమాదం ఉంది.
దీంతో పెదాలను రెగ్యులర్‌గా నాలుకతో తడుపుకోవడం చేయాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల అధరాలపై ఉన్న చర్మం పొర సహజత్వం విచ్ఛిన్నమవుతుంది. ఫలితంగా పెదాలు పొడిబారుతుంటాయి. తడి తగ్గిందని తరచూ నాలుకతో తడమడం వల్ల.. సమస్య పెరుగుతుందే కానీ, తగ్గదు. దీన్నే లిప్ లిక్కర్స్ డెర్మటైటిస్ అంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. కెమికల్స్ లేని లిప్‌బామ్ పెదాలకు అప్లయ్ చేస్తూ ఉండాలి. నీరు సమృద్ధిగా తీసుకోవాలి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడే పెదాలూ ఆరోగ్యంగా ఉంటాయి. అప్పుడు పెదాలు పగలవు, వాటిని నాలుకతో తడమాల్సిన పనీ రాదు. విటమిన్ బి12 సమృద్ధిగా ఉండే పదార్థాలకు మీ డైట్లో చోటివ్వండి. విటమిన్ డి కోసం ఉదయం ఎండలో కాసేపు గడపండి. ఇక నాణ్యమైన లిప్స్టిక్స్ మాత్రమే వాడాలి. సమస్య తీవ్రంగా ఉందనిపిస్తే సంబంధిత వైద్యుణ్ని సంప్రదించండి.