ఒక మహా నాయకుడు మాత్రమే మరింతమంది నాయకులను సృష్టించ గలడు. ఇరవై ఏండ్ల క్రితం కేసీఆర్ ‘జై తెలంగాణ’ నినాదానికి ‘జై..జై.. తెలంగాణ’ అంటూ ఉద్యమ పిడికిలి బిగించినవాళ్లలో పెద్దపెద్ద నాయకులెవరూ లేరు. అంతా అతి సామాన్యులే. యూనివర్సిటీ విద్యార్థులు, చిన్నచిన్న వ్యాపారులు, నిరుద్యోగులు, గృహిణులు, సన్నకారు రైతులే. ఎవరికీ ఉద్యమాలంటే తెలియదు, వ్యూహ ప్రతివ్యూహాల మీద పట్టు లేదు. లీడర్‌ను చూసి నేర్చుకున్నదే ఎక్కువ. నాయకుడి ప్రతి అడుగూ ఓ ఉద్యమ పాఠమే. బలమైన అయస్కాంత క్షేత్ర పరిధిలో ఉన్న ఇనుప ముక్కకు కూడా ఆకర్షణ శక్తి వస్తుంది. కేసీఆర్ నేతృత్వంలోని మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ అదే జరిగింది. కేసీఆర్ సైన్యమై పోరాటాలు చేసినవారంతా రాష్ట్ర అవతరణ సమయానికి నాయకులుగా రాటుదేలారు. యో యస్మిన్ కర్మణి కుశలః తం తస్మినేవ నియోజయేత్.. సమర్థ నాయకుడు తన అనుచరుల్లో ఎవరు ఏ పనిలో నిపుణులో, వారికి ఆ బాధ్యతలు అప్పగిస్తాడని చెబుతుంది అర్థశాస్త్రం! కేసీఆర్ చేసిందీ అదే. క్యాబినెట్ మంత్రుల నుంచి సర్పంచ్ల వరకూ రకరకాల బాధ్యతలు అప్పగించారు. ఒక మేనేజ్మెంట్ స్కూల్ మహా అయితే ఏడాదికి ఓ వందమంది లీడర్లను తయారు చేయగలదు. కానీ, కేసీఆర్.. గల్లీ గల్లీకో నేతను సృష్టించారు.
కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో ఎవరికీ అర్థమయ్యేది కాదు. మోటార్లు కాలుడు.. ట్రాన్స్ఫారంలు కాలుడు. వేలకు వేలు లంచాలు ఇచ్చుడు. యాది చేసుకుంటే గుండెలు దడదడమంటయి. ఇప్పుడు దేశంలో 24 గంటలపాటు హైక్వాలిటీ కరెంట్‌ను రైతులకు ఫ్రీగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.