ముషీరాబాద్, నవంబర్ 14: దళితుల జీవితాలతో బీజేపీ చెలగాటమాడుతున్నదని, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి బదులుగా మనుధర్మ శాస్ర్తాన్ని అమలుచేస్తూ దళితులను మోసగిస్తున్నదని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. రిజర్వేషన్లను ఎత్తేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. హైదరాబాద్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెంట్రల్ యూనివర్శిటీ లాంటి ప్రముఖ విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ పదోన్నతుల అమలును అడ్డుకొంటున్నదని ధ్వజమెత్తారు. వీటిపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాజేందర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.