
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 1,920 కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ 2.30 శాతంగా నమోదైంది. మరోవైపు 417 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 16 వేలు దాటింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,015, మేడ్చల్ మల్కాజిగిరిలో 209, రంగారెడ్డిలో 159, సంగారెడ్డి, హనుమకొండలో 55 కేసులు వెలుగు చూశాయి.
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 2.76 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 90 వేల మందికి మొదటిడోస్, 1.61 లక్షల మందికి రెండో డోస్, 24,685 మందికి బూస్టర్ డోస్ వేశారు. 15-18 ఏండ్లవారికి ఇప్పటివరకు 43 శాతం మందికి మొదటి డోస్ పంపిణీ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17.41 లక్షల డోసులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌లో కలిపి 54,458 పడకలు అందుబాటులో ఉన్నాయి.

కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పోలీస్‌శాఖ సైతం అప్రమత్తమైంది. రెండురోజుల క్రితం కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఒక ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు కరోనా బారినపడ్డారు. తాజాగా రాష్ట్ర మహిళా భద్రత విభాగంలోని రిసెప్షన్ సిబ్బందిలో ఒకరికి, ఇతర విభాగాల్లో ఇద్దరికి కరోనా వచ్చింది. ఈ క్రమంలో జిల్లాలు, అన్ని పోలీస్ కమిషనరేట్ల యూనిట్ అధికారులు, సిబ్బంది అందరూ తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.