కేసీఆర్ ఏ కార్యం తలపెట్టినా అనేక ప్రయోజనాలను నెరవేరుస్తారు. మిషన్ భగీరథ ఇందుకు ఉదాహరణ. ఈ పథకం వల్ల ఇంటింటికీ పరిశుభ్రమైన నల్లా నీరు అందుతుంది. బిందె పట్టుకొని బయటకు పోవడం ఉండదు కనుక, ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని కాపాడినట్టు అవుతున్నది. మంచినీటి వల్ల ప్రజల ఆరోగ్య పరిరక్షణ జరుగుతుంది. ఫ్లోరోసిస్ సమస్యలు ఉండవు. గ్రామ పంచాయతీలు ప్రతి ఎండకాలం నీటి సమస్యపై సతమతమవకుండా, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టగలుగుతాయి. బతుకమ్మ చీరెలు ఇవ్వడం వల్ల చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తున్నది. పేదలు పండుగ నాడు కొత్త చీరెలు కట్టుకుంటున్నారు. చెరువులు నిండడం వల్ల వ్యవసాయం, భూగర్భ నీటి మట్టాలు పెరుగడం, వృక్ష సంపద పెరిగి పర్యావరణ పరిరక్షణ జరగడం మొదలైన అనేక ప్రత్యక్ష పరోక్ష లాభాలున్నాయి. కాలువలు, జలాశయాల్లో చేపలు పెంచవచ్చు. దీనివల్ల సంపద పెరుగుతుంది. ప్రజలకు పోషకాహారం అగ్గువకు అందుతుంది. ప్రజలలో కొనుగోలు శక్తి ఉంటేనే పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల వల్ల కొనుగోలు శక్తి పెరిగి అనేక విధాల వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. కాళేశ్వరం- ఒకే లక్ష్యమున్న ఒకే ప్రాజెక్టు కాదు. నదీ జలాలను పంటలకు, పరిశ్రమలకు, పర్యాటకానికి, జలరవాణాకు, చేపల పెంపకానికి.. ఉపయోగించుకునే సమగ్ర ప్రణాళిక.
రైతు వేదిక ఒక ఆటంబాంబు. రైతు సంఘటితమైతే గొప్ప విప్లవానికి శ్రీకారం చుట్టొచ్చు. రైతు వేదికలోకి పోతే మాకే మొస్తదని అనుకోవద్దు. అందులోకి పోతే బంగారమొస్తది. బతుకు బంగారం అయితది. రైతు వేదిక ద్వారా ఏ పంట పెట్టాలని రైతాంగం నిర్ణయించాలె. పండించిన పంటకు మీ రైతుబంధు కమిటీలే ధర నిర్ణయించాలె.