ఆలోచనలకు రెక్కలొస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 40 అడుగుల ఎత్తున్న కొండపై 15 అడుగుల ఎత్తుతో కళాకారుడు ధీరజ్ రూపొందించిన స్టెయిన్లెస్ స్టీల్ శిల్పం అందరినీ ఆకట్టుకుంటున్నది. ఉన్నత లక్ష్యాలతో క్యాంపస్‌లో అడుగుపెట్టే విద్యార్థుల స్వేచ్ఛకు అద్దం పట్టేలా.. రెక్కలొచ్చి రేపటి ప్రపంచంలోకి ఎగిరిపోవాలని స్ఫూర్తిని రగిలిస్తున్నది. వీటితో పాటు ధీరజ్ చేతిలో ప్రాణం పోసుకున్న మరికొన్ని కళాఖండాలు క్యాంపస్ ఖ్యాతిని ఖండాంతరాలు దాటిస్తున్నవి.
కళాకారుడి ఆలోచనలకు రెక్కలొస్తే తమ కళలతో అద్భుతాలు చేయగలరన్న మాటలకు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఏర్పాటు చేసిన పలు శిల్పాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన స్టెయిన్ లెస్ స్టీల్, రాతితో రూపొందించిన పలు శిల్పాలు వర్సిటీకే ప్రత్యేక అందాన్ని తెచ్చాయి. ఆర్ట్‌పై తనకున్న మక్కువను, క్యాంపస్‌లో చదువుతున్నప్పుడు మదిలో మెదిలిన ఆలోచనలకు రూపం పోస్తూ కళాకారుడు తయారు చేసిన అపురూప శిల్పాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వర్సిటీలోని ఎస్ఎన్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో మాస్టర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్ఏ) 2018లో పూర్తి చేసిన కళాకారుడు ధీరజ్ తయారు చేసిన స్కల్ప్చర్స్ వర్సిటీకి ప్రత్యేక ఆకర్శణగా మారాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేలా రాతిపై రూపొందించిన కళాఖండాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. కళాకారుడికి తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కళారూపంలో చూడటమే జరుగుతుందనడానికి చక్కని ఉదాహరణగా ధీరజ్ రూపొందించిన చిత్రాలు చెబుతున్నాయి. ఉన్నత విద్య కోసం క్యాంపస్‌లో అడుగుపెట్టే విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన స్వేచ్ఛ లభిస్తుందనేలా శిల్పాలు ఉన్నాయి. 40 అడుగుల ఎత్తున్న కొండపై 15 అడుగుల ఎత్తులో స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసిన శిల్పం వర్సిటీలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. శిల్పానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెక్కలు స్వేచ్ఛను తెలియజేస్తున్నాయి.
వర్సిటీలో అద్భుత శిల్పాలు..
స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందించిన మూడు శిల్పాలలో క్యాంపస్ ప్రధాన ద్వారం వద్ద స్వేచ్ఛగా ఆలోచిస్తున్న యువతి శిల్పం
పచ్చని చెట్ల మధ్య 40 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై ఫ్రీమాన్ శిల్పం క్యాంపస్ రోడ్డు పక్కన పుస్తకం చదువుతున్న యువతి శిల్పం.
రాతిపై అద్భుతంగా వర్సిటీ లోగోతో క్యాంపస్ ద్వారం, సౌత్ క్యాంపస్‌లో రెండు రాతి కళాఖండాలు
హెచ్‌సీయూలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్ఏ) చదువుతున్న రోజుల నుంచే కళపై మక్కువ ఏర్పడింది. చాలా మంది కళాకారులు ఉద్యోగాలు చేస్తూ పార్ట్‌టైం కళాకారుడిగా కొనసాగుతున్నారు. నా జీవితాన్ని కళకే అంకితం చేశాను. పూర్తి స్థాయిలో మదిలో మెదిలిన రూపాలకు జీవం పోస్తూ ముందుకు సాగుతున్నా. వర్సిటీలో చదువుతున్న రోజుల్లో నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన శిల్పాలను రూపొందించాను. వాటిని వర్సిటీ అనుమతించడం చాలా సంతోషంగా ఉంది. వీటితో పాటుగా పోలీస్ అకాడమీలో సైతం ఓ ప్రత్యేక రాతి శిల్పాన్ని తయారు చేశా. మరికొన్ని రూపాలకు అప్పా అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయి.
– ధీరజ్, స్కల్ప్చర్ కళాకారుడు