లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడో డోసుల వ్యాక్సిన్‌ను ఉచితంగా వేయనున్నారు. తొలి దశలో 14 జిల్లాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. జైడస్ క్యాడిలా రూపొందించిన జైకోవ్ డీ మూడో డోసుల వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి 28-28 రోజుల వ్యవధిలో వేయనున్నారు. ఇప్పటి వరకు 17.42కోట్లకుపైగా కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను రాష్ట్రంలో పంపిణీ చేశారు.
స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను కేవలం ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నది. ప్రస్తుతం నాలుగో వ్యాక్సిన్‌గా జైడస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. ఈ టీకాను తొలిదశలో లక్నో, ఆగ్రా, అలీగఢ్, అయోధ్య, అజంగఢ్, బరేలీ, ఘజియాబాద్, గోరఖ్‌పూర్, కాన్పూర్ నగర్, మీరట్, మొరాదాబాద్, ప్రయాగ్‌రాజ్, సహరాన్పూర్, వారణాసి జిల్లాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన తర్వాత 15-18 సంవత్సరాల మధ్య పిల్లలకు టీకాలు వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే జనవరి 10 నుంచి రాష్ట్రంలో పది లక్షల మంది ఫ్రంట్‌లైన్ కార్మికులు, మరో పదిలక్షల మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు బూస్టర్ డోస్ వేయనున్నట్లు ఆరోగ్యశాఖ అధికారి మనోజ్ శుక్లా తెలిపారు.