ముంబై: జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ మధ్య విలీనం ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందానికి జీ ఎంటర్టైన్మెంట్ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. స్టాక్స్ ఎక్స్చేంజ్లో ఫైలింగ్ చేసిన రెగ్యులేటరీ ద్వారా ఈ విషయం వెల్లడైంది. అయితే విలీనమైన సంస్థలో సోనీ వాటా 50.86 శాతంగా ఉండనున్నది. జీ ప్రమోటర్లు 3.99 శాతం వాటా కలిగి ఉంటారు. ఇక జీ షేర్హోల్డర్లకు 45.15 శాతం వాటా ఉండనున్నది. ఒక్కటైన జీ-సోనీ సంస్థకు పునీత్ గోయంకా ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. బోర్డు ఆఫ్ డైరక్టర్లను సోనీ గ్రూపు నామినేట్ చేయనున్నది. ఒప్పందంలో భాగంగా టీవీ ఛానళ్లు, ఫిల్మ్ ఆస్తులు, స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లను కలపనున్నారు. సోనీ మ్యాక్స్, జీ టీవీ లాంటి పాపులర్ ఛానళ్లు ఒక్కటి కానున్నాయి. స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్స్ జీ5, సోనీ లివ్లు కూడా ఒకటవ్వనున్నాయి. రెండు సంస్థల కలయికతో సమగ్రమైన ఎంటర్టైన్మెంట్ వ్యాపార రంగాన్ని నిర్మించనున్నట్లు పునీత్ తెలిపారు.