మధుర: వృందావనంలో నిధివన్ రాజ్‌లో రాత్రిపూట వీడియో షూట్ చేసిన ఓ యూట్యూబ్ ఛానల్ అడ్మిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వృందావనంలో నిధివన్ రాజ్ ఉన్నది. భారతీయుల ప్రకారం అది ఓ పవిత్ర ప్రదేశం. ఇక్కడ ప్రతి రోజు రాత్రి పూట రాధా, కృష్ణులు రాసలీలలో పాల్గొంటారని ఓ విశ్వాసం ఉన్నది. ఈ ప్రాంతానికి రాత్రిపూట ఎవరినీ అనుమతించరు. అయితే గౌరవ్జోన్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న గౌరవ్ శర్మ అనే వ్యక్తి వీడియో తీసినట్లు తేలింది. అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గౌరవ్ శర్మను జుడిషియల్ కస్టడీలోకి పంపారు. వీడియో ఘటనలో గౌరవ్‌కు సహకరించిన అసోపియేట్ను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎస్పీ మార్తాండ ప్రకాశ్ సింగ్ తెలిపారు.
యూట్యూబర్ గౌరవ్ శర్మను యూపీ పోలీసులు విచారించారు. నవంబర్ 6వ తేదీన పవిత్ర ప్రదేశమైన నిధివన్రాజ్లో రాత్రి పూట వీడియో తీసినట్లు అతను అంగీకరించాడు. తన సోదరుడు ప్రశాంత్, మిత్రులు మోహిత్, అభిషేక్‌లు కూడా దీనికి సహకరించినట్లు చెప్పారు. అయితే నవంబర్ 9వ తేదీన నిధివన్ రాజ్ వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోపై పూజారులు నిరసన వ్యక్తం చేయడంతో.. దాన్ని డిలీట్ చేశారు. ఐపీసీలోని 295ఏ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐటీ చట్టంలోని 66వ సెక్షన్ ప్రకారం కూడా కేసు బుక్ చేశారు. నిధివన్ రాజ్ పూజారి రోహిత్ గోస్వామి ఫిర్యాదు మేరకు వృందావన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.