గాంగ్టక్: నీటిలో మునిగిపోతున్న సైనికుడ్ని యువ ఆర్మీ అధికారి కాపాడారు. అయితే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించారు. (Army officer dies rescuing soldier) యువ అధికారి మరణంపై ఆర్మీ సంతాపం వ్యక్తం చేసింది. సిక్కిం స్కౌట్స్ రెజిమెంట్‌కు చెందిన 23 ఏళ్ల లెఫ్టినెంట్ శశాంక్ తివారీ ఆరు నెలల కిందటే ఆర్మీలో అధికారిగా నియమితుడయ్యారు. గురువారం ఉదయం వ్యూహాత్మక టాక్టికల్ ఆపరేటింగ్ బేస్ (టీవోబీ) వైపు రూట్ ఓపెనింగ్ పెట్రోల్‌లో పాల్గొన్నారు.
కాగా, ఈ సందర్భంగా కర్ర వంతెన దాడుతుండగా అగ్నివీర్ స్టీఫన్ సుబ్బా జారి వాగు నీటిలో పడ్డాడు. నీటి ప్రవాహంలో అతడు కొట్టుకుపోతుండగా లెఫ్టినెంట్ శశాంక్ తివారీ వెంటనే స్పందించారు. ఆ సైనికుడిని రక్షించేందుకు వాగులోకి దూకారు. నాయక్ పుకార్ కటెల్ సహాయంతో అగ్నివీర్‌ను కాపాడి సురక్షితంగా బయటకు తెచ్చారు.
మరోవైపు నీటి ప్రవాహం ఉధృతికి లెఫ్టినెంట్ శశాంక్ తివారీ కొట్టుకుపోయారు. పెట్రోలింగ్ బృందం ఆయను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అరగంట తర్వాత 800 మీటర్ల దూరంలోని దిగువన శశాంక్ తివారీ మృతదేహాన్ని గుర్తించారు. సైనికుడ్ని కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన యువ అధికారి ధైర్యసాహసాలు, త్యాగాన్ని ఆర్మీ ప్రశంసించింది. శశాంక్ తివారీకి తల్లిదండ్రులు, సోదరి ఉన్నట్లు సంతాప ప్రకటనలో పేర్కొంది.