న్యూఢిల్లీ: లైంగికదాడి, హత్య కేసుల్లోని దోషులకు మరణశిక్ష విధించేందుకు బాధితుల వయసు ఒక్కటే ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బాధితుల వయసు తక్కువగా ఉన్నదన్న ఒక్క కారణం చేత దోషులకు ఉరిశిక్ష విధించలేమని, నేర తీవ్రత, దోషి గత చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కర్ణాటకకు చెందిన ఇరప్పా సిద్దప్ప అనే వ్యక్తి 2010లో ఐదేండ్ల చిన్నారిపై హత్యాచారం జరిపి ఆ మృతదేహాన్ని ఓ బ్యాగ్‌లో కుక్కి సమీపంలోని ఓ కాలువలో పడేశాడు.
కేసును విచారించిన ట్రయల్‌కోర్టు దోషికి మరణశిక్ష విధించింది. ఐదేండ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఈ శిక్ష విధించింది. ఈ తీర్పును కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. దీనిపై సిద్దప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. దోషి చేసిన నేరం తీవ్రమైనదైనప్పటికీ, బాధితురాలి వయసును పరిగణనలోకి తీసుకుంటూ నేరస్తుడికి మరణశిక్ష విధించడం సమంజసం కాదన్నది. దోషికి విధించిన ఉరిశిక్షను 30 ఏండ్ల జైలుశిక్షగా మార్చింది.