బెంగళూరు, ఆగస్టు 26: ఇంటి పనులు చేయాలని, తన తల్లిదండ్రులను చూసుకోవాలని భార్య సహా ఏ మహిళను కూడా పురుషుడు లేదా భర్త ఆదేశించ లేరు, హక్కుగా కోరలేరని స్పష్టం చేసిన కర్ణాటక హైకోర్టు.. ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఇంటి పనులను మహిళలతో పురుషులు కూడా సమానంగా పంచుకోవాలని తెలిపింది. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కుమారుడు, కుమార్తె పైనే ఉంటుంది తప్ప కోడలు, అల్లుడిపై కాదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే తన తల్లిదండ్రులను చూడాలని ఒక మహిళ కోరుకుంటే దానికి, అత్తామామల అనుమతి ఎందుకు తీసుకోవాలని కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూరు సుమలత ప్రశ్నించారు. లొంగుబాటుతో ఒక భార్య అంకితభావాన్ని ఎంతమాత్రం కొలువలేమని ఆమె పేర్కొన్నారు. లింగ వివక్షతో ఏ మహిళ పైనైనా ఆంక్షలు విధించి, ఆమె స్వేచ్ఛకు భంగం కలిగిస్తే అది రాజ్యాంగం కల్పించిన సమానత్వ సూత్రాలకు విరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది.