UK Prime Minister | ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యంగా.. అగ్రరాజ్యంగా పేరొందిన దేశం బ్రిటన్.. ప్రజాస్వామ్య వ్యవస్థ గల ఈ దేశంలో ప్రధాని సూపర్ పవర్. బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభలో మెజారిటీ పొందిన పార్టీ నేతే ప్రధాని అవుతారు. ప్రస్తుతం కన్జర్వేటివ్ పార్టీదే అధికారం. కానీ.. అవినీతి ఆరోపణలతో బోరిస్ జాన్సన్ ప్రధానిగా రాజీనామా చేశారు. ఆయన వారసుడి ఎంపిక కోసం అధికార కన్జర్వేటివ్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ప్రధాని పదవి కోసం ఎంత మంది ఎంపీలైనా పోటీ చేయొచ్చు. అసలు బ్రిటన్ ప్రధాని అభ్యర్థిని ఎలా ఎన్నుకుంటారో చూద్దామా..!
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ చేసే అభ్యర్థులకు కనీసం ఇద్దరు ఎంపీలు నామినేట్ చేయాలి. చాలా మంది పోటీలో ఉంటే.. ఇద్దరు ప్రత్యర్థులు మిగిలే వరకు అంతర్గతంగా పోలింగ్ నిర్వహిస్తారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఎంపీలు తమకు ఇష్టమైన నేతను ఎన్నుకోవచ్చు. ఇలా దఫాదఫాలుగా పోలింగ్ జరిగిన తర్వాత.. దశల వారీగా తక్కువ ఓట్లు వచ్చిన వారిని పోటీ నుంచి తప్పిస్తారు. పోటీలో ఇద్దరు అభ్యర్థులు నిలిచే వరకు పార్టీ ఎంపీల మధ్య పోలింగ్ నిర్వహిస్తారు. తదుపరి ఇద్దరు ప్రత్యర్థులకు దేశవ్యాప్తంగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారు. అందులో మెజారిటీ ఓట్లు వచ్చిన వారే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవుతారు. ఇప్పుడు భారత సంతతి నేత రిషి సునాక్‌తోపాటు మరో ఎనిమిది మంది పోటీ పడ్డారు. అయితే, తొలి రౌండ్లో ఇద్దరు, మలి రౌండ్లో ఒకరు పోటీ నుంచి తప్పించబడ్డారు.
రెండో రౌండ్ పోలింగ్‌లో సునాక్ 101 మంది ఎంపీల మద్దతు పొందగలిగారు. తొలి రౌండ్లో 88 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. రెండో రౌండ్లో మరో అభ్యర్థిని తప్పించారు. ఇక రిషి సునాక్‌కు ప్రత్యర్థిగా భావిస్తున్న వాణిజ్యశాఖ సహాయ మంత్రి పెన్నీ మోర్డౌంట్ 83, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ 64 ఓట్లు పొందారు. ఇప్పటికి భారత సంతతి నేత రిషి సునాక్ లీడ్‌లో ఉన్నా.. కన్జర్వేటివ్ పార్టీలో క్షేత్రస్థాయి మద్దతు ఉన్న వారే ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. రిషి సునాక్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న పెన్నీ మౌర్డౌంట్.. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రిషి సునాక్‌పై ఆయన ప్రత్యర్థులుగా భావిస్తున్నవారు జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం ఆసక్తికర పరిణామం.