వాషింగ్టన్: పత్ర రంధ్రాల ద్వారా మొక్కలు గాలిని పీల్చుకుంటాయని శాస్త్రవేత్తలు శతాబ్దాల క్రితమే గుర్తించారు. ఈ ప్రక్రియను మానవులు చూడటానికి దోహదపడే ఓ పరికరాన్ని ఇలినాయిస్ అర్బేన్-చాంపెయిన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిని ఉపయోగించి నియంత్రిత పరిస్థితుల్లో ప్రత్యక్షంగా ఈ ప్రక్రియను చూడవచ్చు. ఈ ప్రక్రియను నేరుగా పరిశీలించి, రికార్డు చేయగలగడం ఇదే తొలిసారి. ఈ పరికరాన్ని స్టొమాటా ఇన్-సైట్ అని పిలుస్తారు. పత్ర రంధ్రాల ద్వారా నీటి ఆవిరి, కార్బన్డయాక్సైడ్, ఆక్సిజన్ ఏ విధంగా మారుతూ ఉంటాయో గుర్తించవచ్చు. హై రిజల్యూషన్ కన్ఫోకల్ మైక్రోస్కోప్, అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఈ టెక్నాలజీని రూపొందించారు. అరచేతి పరిమాణంలోని చాంబర్లో చిన్న ఆకులను ఉంచి ఈ ప్రయోగం చేశారు. ఈ చాంబర్లో ఉష్ణోగ్రత, తేమ, కాంతి, కార్బన్డయాక్సైడ్, నీరు నియంత్రణలో ఉంటాయి. కిరణజన్య సంయోగ క్రియను శాస్త్రవేత్తలు వీడియో చిత్రీకరించారు. మొక్కలు కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకోవడం, ప్రాణవాయువు, నీటి ఆవిరిలను విడుదల చేయడాన్ని చిత్రీకరించారు. అనేక నమూనాలను పరీక్షించిన తర్వాత స్థిరమైన, నమ్మదగిన డిజైన్‌తో ఈ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి ఐదేండ్ల్లు పట్టింది. మొక్కల కార్యకలాపాలను అర్థం చేసుకుంటే, పంటల ఉత్పత్తి విధానాల్లో విప్లవం వచ్చే అవకాశం ఉంటుంది.